Mohsin Naqvi : భారత్ కు ట్రోఫీ ఇచ్చే ప్రసక్తే లేదు..ఎంత మంది ఎన్ని తిట్టినా మొండిపట్టు వదలని మోహ్సిన్ నఖ్వీ

భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మైదానంలో ఉండే ఉద్రిక్తతలు అప్పుడప్పుడు పరిమితులు దాటి వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా, భారత్ గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ చుట్టూ ఒక పెద్ద వివాదం నెలకొంది. భారత జట్టు విజయం సాధించినా, వారికి ఇంత వరకు ఆసియా కప్ ట్రోఫీ అందలేదు.

Mohsin Naqvi : భారత్ కు ట్రోఫీ ఇచ్చే ప్రసక్తే లేదు..ఎంత మంది ఎన్ని తిట్టినా మొండిపట్టు వదలని మోహ్సిన్ నఖ్వీ
Mohsin Naqvi

Updated on: Oct 10, 2025 | 6:37 PM

Mohsin Naqvi : భారత జట్టు పాకిస్తాన్‌ను ఓడించి ఆసియా కప్ గెలిచినప్పటికీ వారికి ట్రోఫీ మాత్రం దక్కలేదు. దీనికి కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్, పీసీబీ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ. ట్రోఫీని నఖ్వీ తనతో పాటు తీసుకెళ్లడం, దాన్ని ఇప్పుడు దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీసులో బంధించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నఖ్వీ చేసిన ఈ చర్య క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఆసియా కప్ ట్రోఫీని దుబాయ్‌లోని ఏసీసీ హెడ్ ఆఫీస్‌లో లాక్ చేశారు. అంతేకాకుండా, మోహ్సిన్ నక్వీ ఈ ట్రోఫీని తన అనుమతి లేకుండా అక్కడి నుంచి తీయకూడదని, అలాగే భారత్‌కు అప్పగించకూడదని నిర్దేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

భారత జట్టు ఆసియా కప్ గెలిచిన తర్వాత నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. ఆ తర్వాత నఖ్వీ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లిపోయారు. అప్పటి నుండి ట్రోఫీ ఏసీసీ ఆఫీస్‌లోనే ఉంది. నక్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగానే కాకుండా, ఆ దేశానికి హోం మంత్రిగా కూడా ఉన్నారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణమే ఈ సంఘటనలన్నిటికీ కారణమని భావిస్తున్నారు. ఆసియా కప్ సమయంలో కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయడానికి నిరాకరించడం ఈ ఉద్రిక్తతను స్పష్టం చేసింది. నఖ్వీ ఈ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, ట్రోఫీని కేవలం తానే భారత జట్టుకు లేదా బీసీసీఐకి అప్పగిస్తానని, మరెవరూ ఇవ్వడానికి వీలు లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

నఖ్వీ ఈ చర్య పట్ల బీసీసీఐ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. రాబోయే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని అధికారికంగా లేవనెత్తాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, త్వరలోనే మోహ్సిన్ నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పదవి నుంచి తప్పించే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..