ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టీమ్ ఇండియా ఈ ఆల్ రౌండర్ చాలా కష్టమైన సందర్భంలో తనను తాను నిరూపించుకున్నాడు. పాకిస్థాన్‌పై హార్దిక్ పాండ్యా 90 బంతుల్లో 87 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే.. హార్దిక్ క్రీజులోకి దిగే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. టీమ్ ఇండియా కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్‌తో కలిసి పాక్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు హార్దిక్. పాకిస్తాన్‌పై అతను త్రుటిలో సెంచరీ కోల్పోయి ఉండవచ్చు. అయితే ఈ ఆటగాడు అవుట్ అయ్యే ముందు 7 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఐదో వికెట్‌కు ఇషాన్ కిషన్‌తో కలిసి 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తద్వారా టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 15వ ఓవర్ వరకు టీమ్ ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయినా.. పాండ్యా క్రీజులోకి దిగిన వెంటనే ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా పాక్ స్పిన్నర్లపై ఒత్తిడి పెంచాడు. అతను కేవలం 30.1 ఓవర్లలోనే టీమ్ ఇండియాను 150 దాటించాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి పాండ్యా 111 బంతుల్లో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. పాండ్యా 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్ధ సెంచరీ చేసిన తర్వాత, పాండ్యా తన బ్యాటింగ్ గేర్‌ను మార్చి జట్టును 200కు తీసుకెళ్లాడు. అయితే, పాండ్యా సెంచరీకి చేరువలో ఉండగా, షాహీన్ అఫ్రిది అతనిని ఔట్ చేశాడు.
కాగా ఆసియా కప్‌కు ముందు పాండ్యా చాలా ట్రోల్ అవుతున్నాడు. పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా వెస్టిండీస్‌లో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడింది. టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది. దీంతో పాండ్యా కెప్టెన్సీ సందేహాలు తలెత్తాయి. కొందరు అతన్ని బయటకు పంపాలని కూడా మాట్లాడారు. అంతే కాదు పాండ్యాను స్వార్థపరుడు అని కూడా పిలిచారు. ముఖ్యంగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడని నెటిజన్లు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయితే ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కాగా ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్ (81 బంతుల్లో 82, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కాగా ప్రస్తుతం పల్లెకెలలో వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్‌లో ఓవర్లు కుదించవచ్చు. పాక్ టార్గెట్ కూడా మారిపోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..