
T20 World Cup 2026 : ప్రపంచ క్రికెట్ పండుగ టీ20 వరల్డ్ కప్ 2026 మరికొద్ది రోజుల్లోనే (ఫిబ్రవరి 7 నుంచి) ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. టీమిండియా తరఫున ఆడే 15 మంది ఆటగాళ్లు కాకుండా, ఇతర దేశాల జట్లలో కూడా భారీ సంఖ్యలో భారతీయులు కనిపిస్తున్నారు. అమెరికా నుంచి ఒమన్ దాకా.. దాదాపు 40 మంది భారతీయ మూలాలున్న క్రికెటర్లు విదేశీ జెండాల కింద మైదానంలోకి దిగబోతున్నారు. ఈసారి వరల్డ్ కప్‌లో ఒక ఆసక్తికరమైన గణాంకం బయటపడింది. అమెరికా, కెనడా, యూఏఈ, ఒమన్ జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్లు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. కెనడా జట్టులో ఏకంగా 11 మంది భారతీయులు ఉండగా, యూఎస్ఏ జట్టులో 9 మంది, ఒమన్ మరియు యూఏఈ జట్లలో తలో ఏడుగురు చొప్పున ఆడుతున్నారు. అంటే కేవలం ఈ నాలుగు దేశాల జట్లలోనే 34 మంది భారతీయులు ఉండటం విశేషం. మిగిలిన ఇతర దేశాల జట్లను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 40 దాటుతోంది.
ముంబైలో పుట్టి పెరిగిన అమెరికా ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవల్కర్ వంటి ఆటగాళ్లకు ఇది ఒక భావోద్వేగమైన టోర్నమెంట్. తన సొంత నగరమైన ముంబైలోని వాంఖడే స్టేడియంలో, తన పుట్టిన దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా అతను బంతిని విసరబోతున్నాడు. ఇలాంటి ఆటగాళ్లు భారత్‌లో సరైన అవకాశాలు రాక విదేశాలకు వెళ్లి, అక్కడ తమ టాలెంటును నిరూపించుకుని ఇప్పుడు ప్రపంచకప్ ఆడే స్థాయికి చేరుకున్నారు.
ఈసారి టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత టాప్-8 జట్లు సూపర్-8 దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి సెమీఫైనల్స్, ఆపై మార్చి 8న గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. మరోవైపు, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించే యోచనలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
విదేశీ జట్లలో మన వాళ్లు కేవలం ఆటగాళ్లుగానే కాదు, స్పాన్సర్లుగా కూడా కనిపిస్తున్నారు. అమెరికా, యూఏఈ జట్లకు ప్రధాన స్పాన్సర్లుగా భారతీయ కంపెనీలే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ క్రికెట్ మీద భారత్‌కు ఉన్న పట్టును చూపిస్తోంది. ఏదేమైనా, ఈ ప్రపంచకప్‌లో ఎవరు గెలిచినా.. మైదానంలో ఏదో ఒక రూపంలో భారతీయుల భాగస్వామ్యం ఉండటం మనకు గర్వకారణమే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి