Aman Khan : ఐపీఎల్‌లో బెంచ్‌కే పరిమితం.. ఇక్కడ మాత్రం 34 బంతుల్లో సెంచరీతో CSK ప్లేయర్ వీరవిహారం
Aman Khan : పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్ 2026లో అమన్ ఖాన్ 34 బంతుల్లో సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవంశి రికార్డును బద్దలు కొట్టి 129 పరుగులతో మెరిశాడు. సీఎస్కేలో బెంచ్‌కే పరిమితమైన ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Aman Khan : క్రికెట్ మైదానంలో సిక్సర్ల సునామీ ఎలా ఉంటుందో ముంబైకి చెందిన స్టార్ ఆల్‌రౌండర్ అమన్ ఖాన్ మరోసారి చూపించాడు. ప్రస్తుతం జరుగుతున్న పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్ 2026(PPL 2026) టోర్నీలో విలన్యుర్ మోహిత్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్ ఖాన్, ప్రత్యర్థి బౌలర్లపై నిర్దయాత్మకంగా విరుచుకుపడ్డాడు. మహే మెగాలో స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే 129 పరుగులు సాధించి వన్-మ్యాన్ షోతో స్టేడియం మొత్తాన్ని హోరెత్తించాడు. ఇందులో ఏకంగా 15 కళ్ళు చెదిరే సిక్సర్లు, 6 ఫోర్లు ఉండటం అతని బ్యాటింగ్ వీరత్వాన్ని స్పష్టం చేస్తోంది.
ఈ అద్భుత ఇన్నింగ్స్ ద్వారా అమన్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో భారత ఆటగాళ్ల పరంగా ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డులను తిరగరాశాడు. కేవలం 34 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకుని, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరిట ఉన్న రికార్డులను అధిగమించాడు. వైభవ్ సూర్యవంశీ గతంలో ఐపీఎల్ 2025లో 35 బంతుల్లో, ఐపీఎల్ 2026లో 36 బంతుల్లో సెంచరీలు సాధించగా, ఇప్పుడు అమన్ ఖాన్ కేవలం 34 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుని ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
సౌత్ కొరియా, జపాన్ దేశాల ఇతర లీగ్‌లను మినహాయించి చూస్తే.. భారత దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్స్ చరిత్రలో అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అమన్ ఖాన్ నిలిచాడు. ఈ జాబితాలో తెలంగాణ టీ20 లీగ్‌లో కేవలం 32 బంతుల్లో సెంచరీ చేసిన అమన్ రావు పేరాల మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అమన్ ఖాన్ 34 బంతులతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, యూసుఫ్ పఠాన్ (37 బంతులు), ప్రియాంశ్ ఆర్య (39 బంతులు) ఈ అరుదైన ఫీట్‌లో తదుపరి స్థానాల్లో నిలిచారు.
ఈ మ్యాచ్‌లో విలన్యుర్ మోహిత్ కింగ్స్ జట్టుకు అమన్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో పడింది. అలాంటి క్లిష్ట సమయంలో 8వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన అమన్ ఖాన్, అప్పటివరకు ఉన్న ఒత్తిడిని ఒక్కసారిగా ప్రత్యర్థి టీమ్ వైపు నెట్టేశాడు. 300 స్ట్రైక్ రేట్‌తో వినాశకర బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 241 పరుగుల భారీ స్థాయికి చేర్చాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో 3 వికెట్లు, ఫీల్డింగ్‌లో 3 క్యాచ్‌లు పట్టి ‘ఆల్‌రౌండర్’ అంటే తానే అని నిరూపించుకున్నాడు.
ఈ తరహా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికీ అమన్ ఖాన్‌కు ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. గతంలో 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఒక మ్యాచ్, 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 11 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు గాను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇతనిని దక్కించుకున్నప్పటికీ, సీజన్ మొత్తం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్‌లో అతను నమోదు చేసిన ఈ అద్భుతమైన ఫాస్టెస్ట్ హండ్రెడ్ ప్రదర్శన, రాబోయే ఐపీఎల్ మినీ వేలంలో లేదా తదుపరి సీజన్ పునరాగమనంలో అతనికి బలమైన అవకాశాన్ని కల్పించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
