అఫ్గాన్ మహిళలకు నర్సింగ్ విద్యను నిషేధించాలన్న తాలిబన్ ప్రభుత్వం నిర్ణయాన్ని ఆ దేశ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రషీద్ ఖాన్.. మాతృభూమిలో మహిళలపై విధించిన ఆంక్షలపై ఆందోళన, ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు వైద్య శిక్షణను నిషేధిస్తూ తాలిబాన్ ప్రభుత్వ మంత్రి హిబతుల్లా అఖుంద్జాదా డిసెంబర్ 2న ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నిర్ణయంతో అఫ్గన్ మహిళలు ఇకపై నర్సింగ్, వైద్య శిక్షణను పొందలేదరు. ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసిన రషీద్ ఖాన్ అన్ని రంగాలలో ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణలో మహిళా విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ‘ప్రతి ముస్లిం స్త్రీ, పురుషులకు విద్య తప్పనిసరి. కానీ మా అక్కాచెల్లెళ్లకు వైద్య విద్య తలుపులు మూసుకుపోయాయన్న వార్త నాకు బాధ కలిగించింది. తాలిబన్ ప్రభుత్వ నిర్ణయంతో నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. నర్సింగ్ కోర్సుల నుంచి ఆఫ్ఘన్ మహిళలను నిషేధిస్తూ మీరు తీసుకున్న నిర్ణయంపై ఒక్కసారి పునరాలోచించించండి. దయచేసి అందరికీ విద్య అందించండి’ అని రషీద్ ఖాన్ కోరాడు.
‘దేశాభివృద్ధికి పునాది విద్యతోనే మొదలవుతుంది. మా అక్కాచెల్లెళ్లకు కూడా చదువుకునే హక్కు ఉంది. వైద్యరంగంతో పాటు వారు అన్ని రంగాలలో సమాజానికి సేవ చేయగలరు. మీరు ఈ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుంటారని, మా సోదరీమణులకు విద్యను అందిస్తారని నేను ఆశిస్తున్నాను. అఫ్ఘనిస్తాన్ లోని వైద్య సంస్థలను మూసివేయడం మన దేశానికి అంత మంచిది కాదు. ఈ నిర్ణయం మహిళల భవిష్యత్తునే కాకుండా మన సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం మన దేశం కీలక దశలో ఉంది. దేశానికి ప్రతి రంగంలోనూ, ముఖ్యంగా వైద్య రంగంలో నిపుణుల అవసరం ఉంది. ముఖ్యంగా మహిళా వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ఇది నేరుగా మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
‘మా సోదరీమణులు, తల్లులకు వారి అవసరాలను నిజంగా అర్థం చేసుకునే వైద్య నిపుణులు అందించే సంరక్షణ అవసరం. కాబట్టి, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. అఫ్ఘన్ బాలికలు తమ విద్యాహక్కును తిరిగి పొదాలి. అప్పుడే వారు దేశాభివృద్ధికి తోడ్పడగలరు’ అని రషీద్ ఖాన్ తన లేఖలో నొక్కిచెప్పారు. తాలిబన్ ప్రభుత్వ నిర్ణయాలపై ఆప్ఘనిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, ఆఫ్ఘన్ జెండాను మార్చాలని ప్రతిపాదించిన తాలిబన్లపై రషీద్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రషీద్ ఖాన్ మరోసారి మహిళా విద్య కోసం తన గళాన్ని పెంచాడు.
🤲🏻🤲🏻🇦🇫🇦🇫 pic.twitter.com/rYtNtNaw14
— Rashid Khan (@rashidkhan_19) December 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..