Abhishek Sharma : వరుసగా 3 సార్లు డకౌట్..ఫైనల్లో వీర బాదుడు..అభిషేక్ సంచలన ఇన్నింగ్స్‌కు కారణం దూబేనా ?
Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అభిషేక్ శర్మ శివమ్ దూబే బ్యాట్‌తో ఆడి 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. వరుస డకౌట్ల తర్వాత ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు.అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక ఆసక్తికరమైన బ్యాట్ సీక్రెట్ దాగుందని అభిషేక్ స్వయంగా వెల్లడించాడు.

Abhishek Sharma : టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. నిన్న మొన్నటి వరకు అసలు ఈ అబ్బాయికి టీమ్‌లో చోటు ఎందుకు? అని విమర్శించిన వారే ఇప్పుడు అభిషేక్.. నువ్వు మామూలోడివి కాదు సామీ! అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్ ఆద్యంతం విఫలమై, వరుసగా మూడు సార్లు సున్నా పరుగులకే అవుట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్.. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. కివీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి భారత్ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక ఆసక్తికరమైన బ్యాట్ సీక్రెట్ దాగుందని అభిషేక్ స్వయంగా వెల్లడించాడు.
ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ శర్మ ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. తను ఈ మ్యాచ్‌లో తన సొంత బ్యాట్‌తో కాకుండా, టీమ్ మేట్ శివమ్ దూబే బ్యాట్‌ను అడిగి తీసుకుని బ్యాటింగ్ చేశాడట. “టోర్నమెంట్ అంతా బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాను. ఫైనల్ మ్యాచ్ రోజు ఉదయం ఎలాగైనా ఏదో ఒకటి కొత్తగా చేయాలనిపించింది. నా ఫ్రెండ్ శుభ్‌మన్ గిల్ నా పక్కన లేడు, అందుకే దూబే దగ్గరికి వెళ్లి నీ బ్యాట్ ఇస్తావా అని అడిగాను. ఆ బ్యాట్‌తోనే ఈరోజు ఈ ఇన్నింగ్స్ ఆడాను. థాంక్యూ దూబే!” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. దూబే బ్యాట్ అభిషేక్ పాలిట లక్కీ చార్మ్లా మారిందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది 2026 టీ20 వరల్డ్ కప్‌లోనే అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో కివీస్ ఫీల్డర్లను ఉరుకులు పరుగులు పెట్టించాడు. సంజూ శాంసన్‌తో కలిసి రెండో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్ 255 పరుగుల భారీ స్కోరు సాధించడానికి గట్టి పునాది వేశాడు. విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన అభిషేక్, బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు.
నిజానికి ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ గణాంకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా బరిలోకి దిగినప్పటికీ, టోర్నీలో కేవలం 17.6 సగటుతో 141 పరుగులు మాత్రమే చేశాడు. మూడు సార్లు డకౌట్ (0) అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. భారత బ్యాటర్లలోనే అత్యంత తక్కువ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచినప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడిపై నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫైనల్లో విధ్వంసం సృష్టించి భారత్‌ను ప్రపంచ విజేతగా నిలిపాడు. 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్, ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
