AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir: నాడు కోహ్లీ కోసం కప్పును.. నేడు పేదల కోసం కోట్లను.. గంభీర్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు..

28 ఏళ్ల వయసులో తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని కోహ్లీకి ఇచ్చేసిన పెద్ద మనసు.. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో గెలుపు గుర్రాన్ని నిలిపినా ప్రశంసలకు దూరంగా ఉన్న మొండితనం.. గౌతమ్ గంభీర్ అంటేనే ఒక అసాధారణ ప్రయాణం. ఈ సీరియస్ కోచ్ వెనుక ఉన్న భావోద్వేగాల కథ గురించి తెలుసుకుందాం..

Gautam Gambhir: నాడు కోహ్లీ కోసం కప్పును.. నేడు పేదల కోసం కోట్లను.. గంభీర్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు..
Gautam Gambhir Untold StoryImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Jun 07, 2026 | 11:09 AM

Share

భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ అనగానే స్ట్రెయిట్ డ్రైవ్ గుర్తుకొస్తుంది. సౌరవ్ గంగూలీ అనగానే లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పిన సీన్ కళ్లముందు కదలాడుతుంది. మహేంద్ర సింగ్ ధోనీ అనగానే వాంఖడే స్టేడియంలో కొట్టిన ఆ సిక్స్ మెరుస్తుంది. కానీ గౌతమ్ గంభీర్ అనగానే ఒక చిత్రం కాదు.. ఒక భావన గుర్తొస్తుంది. జట్టు గెలుపు కోసం ప్రాణం పెట్టే వాడు, కానీ ఆ గెలుపు క్రెడిట్ అంతా వేరే వాళ్ల ఖాతాలోకి వెళ్తుంటే ఏమాత్రం పట్టించుకోకుండా నీడలా నిలబడే ఒక నిఖార్సైన పోరాట యోధుడు గుర్తొస్తాడు. ప్రస్తుతం 44 ఏళ్ల వయసులో భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తూ, రూ. 200 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన గంభీర్ జీవితం వెనుక ఎవరికీ తెలియని ఎన్నో భావోద్వేగ కోణాలు ఉన్నాయి. పుట్టిన 18 రోజులకే తాతగారింటికి దత్తత వెళ్లిన బాలుడి నుండి.. 28 ఏళ్లకు తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని తోటి ఆటగాడికి ఇచ్చేసిన ఉదారవాది వరకు.. నేడు ఢిల్లీ వీధుల్లో పేదలకు రూపాయికే కడుపునిండా భోజనం పెడుతున్న మహారాజు వరకు.. ఇదొక అద్భుతమైన కథనం..

పుట్టిన 18 రోజులకే మారిన జీవితం..

1981 అక్టోబర్‌లో గౌతమ్ జన్మించినప్పుడు, అతని తల్లి సీమ హాస్పిటల్ నుండి తిరిగి వస్తూ రాజేంద్ర నగర్‌లోని తన తండ్రి సత్పాల్ గులాటి ఇంట్లో ఆగారు. ఆ పసికందును చూడగానే సత్పాల్.. ‘‘ఈ బాబు నా దగ్గరే ఉంటాడు’’ అని డిసైడ్ చేశారు. అలా 18 రోజుల వయసులోనే గంభీర్ తన తాతయ్య, అమ్మమ్మల వద్ద పెరగడం ప్రారంభించాడు. క్రికెట్ పిచ్‌పై గంభీర్ అంటేనే మొండితనం. 2009లో న్యూజిలాండ్‌తో జరిగిన నెపియర్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. టీమిండియా ఫాలో ఆన్ ఆడుతూ ఓటమి అంచున ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో బాధ్యతారహితంగా అవుట్ అయినందుకు గంభీర్ లోపల ఒక తపన మొదలైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 గంటల 42 నిమిషాల పాటు క్రీజులో గోడలా నిలబడ్డాడు. 436 బంతులను ఎదుర్కొని 137 పరుగులు చేసి ఆ మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. లంచ్, టీ బ్రేక్.. సెషన్ల కొద్దీ మారినా గంభీర్ మాత్రం క్రీజు వదల్లేదు. తన సహజసిద్ధమైన అటాకింగ్ ఆటను పక్కనబెట్టి, దేశం కోసం ఎలా నిలబడాలో ఆ రోజు చూపించాడు.

కోహ్లీకి ట్రోఫీ త్యాగం.. వరల్డ్ కప్ ఫైనల్స్ లో 97రన్స్

2009 లో ఈడెన్ గార్డెన్స్‌లో విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో మొదటి వన్డే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో గంభీర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. కానీ అతను దాన్ని నిర్మొహమాటంగా కోహ్లీకి ఇచ్చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. క్రికెట్ అనేది టీమ్ గేమ్, ఇక్కడ ఒకరిద్దరి ముఖాలు ముఖ్యం కాదు, జట్టు ముఖ్యం అని నమ్మే వ్యక్తి గంభీర్. దురదృష్టవశాత్తూ, భారత క్రికెట్ చరిత్ర గంభీర్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వలేదు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై గంభీర్ కొట్టిన 75 పరుగులు.. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ముంబై వాంఖడే స్టేడియంలో సచిన్, సెహ్వాగ్ అవుట్ అయి దేశమంతా గుండె ఆగిపోయేలా చూస్తున్నప్పుడు ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్.. భారత క్రికెట్‌ను ప్రపంచ విజేతగా నిలిపాయి. కానీఆ రెండు ఫైనల్స్ ముగిశాక కెమెరాలు, క్రెడిట్ అంతా కెప్టెన్ ధోనీ వైపు వెళ్లాయి. కేవలం 3 పరుగులు తక్కువతో సెంచరీ మిస్ అయిన గంభీర్.. ఎలాంటి హడావుడి లేకుండా డ్రెస్సింగ్ రూమ్ నీడల్లోకి వెళ్లిపోయాడు. చరిత్ర అతని 97 పరుగులను మరిచినా, ఆ రోజు అతను క్రీజులో లేకపోతే భారత్ కప్ గెలిచేది కాదనేది పచ్చి నిజం.

కేవలం క్రికెటర్ కాదు.. రూ. 550 కోట్ల బిజినెస్ సామ్రాజ్యం

గంభీర్ కేవలం క్రికెట్ ద్వారానే సంపాదించలేదు. అతని తండ్రి దీపక్ గంభీర్ 1977లో ప్రారంభించిన యోగేష్ ట్రేడింగ్ కంపెనీలో గౌతమ్‌కు 20శాతం యాక్టివ్ భాగస్వామ్యం ఉంది. ఆర్థిక సంవత్సరం 2023లో ఈ సంస్థ ఏకంగా రూ.734.94 కోట్ల టర్నోవర్ సాధించింది, కాగా FY25 నాటికి అది రూ. 556.89 కోట్లుగా నమోదైంది. కేవలం 3శాతం నుండి 4శాతం ప్రాఫిట్ మార్జిన్‌తో నడిచే ఈ టెక్స్‌టైల్ బిజినెస్‌లో రోజువారీ ఒడిదుడుకులు, క్లయింట్ల పేమెంట్ల టెన్షన్లను గంభీర్ దగ్గరుండి గమనించాడు. అందుకే క్రికెట్ పిచ్‌పైనైనా, బిజినెస్‌లోనైనా ఎంత కష్టమైనా సరే ప్లాన్ మార్చకుండా నిలబడాలి అనే క్రమశిక్షణ అతనికి అలవడింది.

ఇది కాకుండా కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి ఐపీఎల్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్, 2024 జూలైలో రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. బీసీసీఐ అతనికి ఏడాదికి రూ.12 నుండి 14 కోట్ల భారీ పారితోషికాన్ని అందిస్తోంది. ఇది టాప్ గ్రేడ్ ఆటగాళ్ల శాలరీ కంటే ఎక్కువ. అదనంగా Uber, CoinDCX, Redcliffe Labs వంటి ప్రముఖ బ్రాండ్స్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా గంభీర్ నెట్ వర్త్ నేడు రూ. 200 కోట్లకు పైగా ఉంది.

చెత్త కుప్పలను వంటశాలలుగా మార్చి.. రూపాయికే భోజనం..

కోట్లు సంపాదిస్తున్నా గంభీర్ లోని మానవత్వం మారలేదు. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ద్వారా డిసెంబర్ 24, 2020న ఢిల్లీలోని గాంధీ నగర్‌లో మొదటి జన రసోయ్ (కమ్యూనిటీ కిచెన్) ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 4 కేంద్రాలలో ప్రతిరోజూ దాదాపు 4,000 మందికి పైగా నిరుపేదలకు రూపాయికే అన్నం, పప్పు, కూర, సాలడ్‌తో కూడిన సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. ఉచితంగా ఇస్తే అది భిక్షం అవుతుందని, రూపాయి తీసుకుంటే అది గౌరవప్రదమైన లావాదేవీ అవుతుందని గంభీర్ భావన.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మున్సిపాలిటీ వాళ్లు వదిలేసిన చెత్త కుప్పల ప్రాంతాలను శుభ్రం చేయించి, వాటిని అత్యాధునిక, పరిశుభ్రమైన వంటశాలలుగా మార్చి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనితో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పిల్లల చదువు బాధ్యతను గంభీర్ ఫౌండేషన్ పూర్తిగా చూసుకుంటోంది. 2017 సుక్మా నక్సల్స్ దాడిలో అమరులైన 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల పిల్లల విద్యా నిధి కోసం ఆర్బీఎల్ బ్యాంక్ రూ.1.75 కోట్ల సీఎస్ఆర్ నిధులను ఈ ఫౌండేషన్‌కు అందించింది. కనిపించే గ్లామర్ కోసం కాకుండా పక్కా బాధ్యత కోసం బతికే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.

Follow Us