టెస్ట్ ఫార్మాట్‌లో తొలి హ్యాట్రిక్.. ఆడింది కేవలం 18 టెస్టులు.. కట్ చేస్తే.. ఆ బౌలర్ కెరీర్ ఖతం..

ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్‌ ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నీజర్ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే..

టెస్ట్ ఫార్మాట్‌లో తొలి హ్యాట్రిక్.. ఆడింది కేవలం 18 టెస్టులు.. కట్ చేస్తే.. ఆ బౌలర్ కెరీర్ ఖతం..
Cricket

Updated on: Jan 05, 2023 | 9:55 PM

ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్‌ ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నీజర్ హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా.? టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ ఎవరి పేరు మీద లిఖించబడిందో.? సాధారణంగా ఏ బౌలర్‌కు హ్యాట్రిక్ వికెట్లు తీయడం అంత తేలికైన పని కాదు. చాలా సందర్భాలలో, బౌలర్లు వరుసగా రెండు వికెట్లు తీసినప్పటికీ.. మూడో బంతికి థర్డ్ వికెట్ మిస్ అవుతుంటారు. టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడితే, ఇప్పటివరకు 46 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. వీటిలో చివరిది జూన్ 2021లో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ తీసింది. మరి ఈ ఫార్మాట్‌లో తొలి హ్యాట్రిక్ సరిగ్గా 144 సంవత్సరాల క్రితం ఇదే జనవరి నెలలో తీసింది.

సరిగ్గా 144 సంవత్సరాల క్రితం.. అంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అది మూడో మ్యాచ్. తేదీ 2 జనవరి 1879. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఆస్ట్రేలియా పేసర్లు ఫ్రెడ్ స్పోఫోర్త్, ఫ్రాంక్ అలెన్ దెబ్బకు ఆ జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ 7 వికెట్లు కేవలం 26 పరుగులే చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లోనే తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఈ ఫీట్ ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ స్పోఫోర్త్ చేశాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు ఇంగ్లాండ్ బ్యాటర్లను పెవిలియన్ పంపించి.. హ్యాట్రిక్ సాధించాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. స్పోఫోర్త్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు, రెండో ఇన్నింగ్స్‌లో అయితే ఏకంగా 7 వికెట్లు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

కేవలం 18 టెస్టులతో కెరీర్ ఖతం..

ఇంతటి అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టినప్పటికీ స్పోఫోర్త్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కేవలం 18 టెస్ట్ మ్యాచ్‌లతోనే ముగిసింది. దీంతో స్పోఫోర్త్ 18 టెస్టుల్లో మొత్తంగా 94 వికెట్లు పడగొట్టాడు.