CWG 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ సత్తా.. జూడోలో సుశీలా దేవి, విజయ్‌ కుమార్‌‌కు పతకాలు..

|

Aug 02, 2022 | 5:44 AM

జూడోలో 48 కిలోల విభాగంలో సుశీలా దేవి లిక్మాబామ్ భారతదేశానికి ఏడో పతకాన్ని సాధించిపెట్టింది. మహిళల జూడో 48 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించింది.

CWG 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ సత్తా.. జూడోలో సుశీలా దేవి, విజయ్‌ కుమార్‌‌కు పతకాలు..
Sushila Devi, Vijay Kumar
Follow us on

Sushila Devi Likmabam: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ సత్తాచాటుతోంది. ఇప్పటివకే పలువురు క్రీడాకారులు పలు విభాగాల్లో పతకాలను సాధించారు. తాజాగా.. జూడోలో 48 కిలోల విభాగంలో సుశీలా దేవి లిక్మాబామ్ రజత పతకాన్ని సాధించగా.. జూడో పురుషుల 60 కేజీల విభాగంలో విజయ్‌ కుమార్‌ కాంస్యం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత క్రీడాకారులు కైవసం చేసుకున్న పతకాల సంఖ్య 8కి చేరింది. మహిళల జూడో 48 కేజీల విభాగంలో సుశీలా దేవి లిక్మాబామ్ రజత పతకాన్ని సాధించింది. జూడో 48 కిలోల ఫైనల్‌లో సుశీలాదేవి లిక్మాబామ్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. ఓటమిని చవిచూసింది. ఫైనల్‌లో సుశీల.. స్వర్ణం చేజిక్కించుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్‌బోయ్‌తో తలపడింది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య మ్యాచ్ 4 నిమిషాల 25 సెకన్ల పాటు సాగింది. మ్యాచ్ సమయంలో ఇద్దరు ఆటగాళ్లకు పెనాల్టీలుగా 2-2 పాయింట్లు లభించాయి. ఆ తర్వాత గోల్డెన్ నంబర్ ద్వారా నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మైఖెలా వైట్‌బోయ్ వాజా-ఆరి స్కోరింగ్ కింద 1 పాయింట్‌తో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

సుశీల సెమీ ఫైనల్‌లో ఇపోన్‌లో మారిషస్‌కు చెందిన ప్రిస్సిల్లా మోరాండ్‌ను ఓడించింది. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్స్‌లో సుశీల మలావికి చెందిన హ్యారియెట్ బోన్‌ఫేస్‌ను ఓడించింది. 27 ఏళ్ల జుడోకా సుశీలా దేవి ఇంతకు ముందు కూడా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించింది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో, ఈ ఈవెంట్‌లో ఆమె భారత్‌కు రజత పతకాన్ని గెలుచుకోగలిగింది. దీంతో సుశీలాదేవి కామన్వెల్త్ గేమ్స్ జూడో ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.

ఇవి కూడా చదవండి

మణిపూర్‌కు చెందిన.. సుశీల ఫిబ్రవరి 1, 1995న జన్మించింది. సుశీలకు చిన్నప్పటి నుండి జూడో అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె కుటుంబం ఈ క్రీడతో ముడిపడి ఉంది. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారిణిగా సుశీల నిలిచింది.. సుశీల ప్రముఖ బాక్సర్ MC మేరీ కోమ్‌ను తన రోల్ మోడల్‌గా భావిస్తుంది.

విజయ్‌ కుమార్‌‌కు కాంస్యం..

జూడో పురుషుల 60 కేజీల విభాగంలో విజయ్‌ కుమార్‌ కాంస్యం కైవసం చేసుకున్నాడు. సైప్రస్‌కు చెందిన పెట్రోస్‌ను ఓడించి విజయ్‌ కాంస్య పతాకాన్ని దక్కించుకున్నాడు. జూడోలో పతకాలు సాధించిన వీరిద్దరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్విటర్ వేదికగా అభినందనలు తెలియజేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..