Codi Yusuf : జింబాబ్వేకు ‘కోడి’ దెబ్బ.. అరంగేట్రంలోనే అదరగొట్టిన దక్షిణాఫ్రికా పేసర్!

కోడి యూసఫ్ రాకతో సౌతాఫ్రికా టీం బౌలింగ్ విభాగానికి కొత్త బలం వచ్చినట్లు అయింది. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ యువ పేసర్ తన బౌలింగ్‌తో అదరగొట్టేశాడు. తన 14 ఓవర్ల స్పెల్‌లో కేవలం 42 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు

Codi Yusuf : జింబాబ్వేకు కోడి దెబ్బ.. అరంగేట్రంలోనే అదరగొట్టిన దక్షిణాఫ్రికా పేసర్!
Codi Yusuf

Edited By: TV9 Telugu

Updated on: Jul 14, 2025 | 4:10 PM

Codi Yusuf : సౌతాఫ్రికాకు ఓ కొత్త స్టార్ ప్లేయర్ దొరికేశాడు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన యువ పేసర్ కోడి యూసుఫ్ తన బౌలింగ్‌తో అదరగొట్టేశాడు. తన బౌలింగ్‎తో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించి ఏకంగా మూడు వికెట్లు తీశాడు. తన బౌలింగ్ చూస్తుంటే సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ గుర్తుకు వస్తున్నాడని అభిమానులు అంటున్నారు. మరి ఈ కోడి యూసుఫ్ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. కోడి యూసుఫ్ రాకతో సౌతాఫ్రికా టీం బౌలింగ్ విభాగానికి కొత్త బలం వచ్చి చేరింది. ఈ 27 ఏళ్ల యువ పేసర్ జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆరంగేట్రంలోనే అద్భుతంగా బౌలింగ్ వేసి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. తన 14 ఓవర్ల స్పెల్‌లో కేవలం 42 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే కీలక బ్యాట్స్‌మెన్లు అయిన తకుద్జ్వనషే కైటానో, నిక్ వెల్చ్, వెల్లింగ్‌టన్ మసకద్జాను ఫెవీలియన్‎కు పంపాడు.

సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌ను 418 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, జింబాబ్వేను 251 పరుగులకే ఆలౌట్ చేయడంలో కోడి యూసఫ్ కీలక పాత్ర పోషించాడు. అతని ఈ బ్లాక్‌బస్టర్ అరంగేట్రం అభిమానులందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా, అతని బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ను గుర్తుచేసే కొన్ని అంశాలు కనిపించాయని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

కోడి యూసుఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

కోడి యూసఫ్ దక్షిణాఫ్రికాలోని క్నిస్నా పట్టణంలో ఏప్రిల్ 10, 1998న జన్మించాడు. ప్రస్తుతం తన వయసు 27 సంవత్సరాలు. జాతీయ జట్టులోకి రాకముందు, యూసఫ్ డొమెస్టిక్ క్రికెట్‌లో గౌటెంగ్, లయన్స్ జట్ల తరఫున ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో యూసఫ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను ఆడిన 33 మ్యాచ్‌లలో ఏకంగా 103 వికెట్లు తీసి సత్తా చాటుకున్నాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన కారణంగానే తనకు సౌతాఫ్రికా టెస్ట్ లో ఛాన్స్ దొరికింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో యూసఫ్ ఎనిమిది సార్లు నాలుగు వికెట్ల హాల్స్, నాలుగు సార్లు ఐదు వికెట్ల హాల్స్ సాధించాడు. ఈ సమయంలో తన ఎకానమీ 3.38గా ఉంది.

కోడి యూసఫ్ దక్షిణాఫ్రికాకు చెందిన టీ20 లీగ్ SA20లో కూడా ఆడుతాడు. అతను పార్ల్ రాయల్స్ జట్టు తరఫున ఐదు మ్యాచ్‌లలో మూడు వికెట్లు తీశాడు. అయితే బౌలింగ్ ఎకానమీ మాత్రం 10గా ఉంది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, యూసుఫ్ సెప్టెంబర్ 2023 లో ఆష్లిన్ యూసుఫ్‌ను పెళ్లి చేసుకున్నారు. యూసఫ్ 2018లోనే తన టీ20 కెరీర్‌ను ప్రారంభించాడు. మపుమలంగ జట్టు తరఫున కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆడాడు. ప్రస్తుతం టెస్ట్ అరంగేట్రం చేయడం ద్వారా తను ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.