PV Sindhu Academy: పీవీ సింధుకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. విశాఖలో అకాడమీకి రెండు ఎకరాలు కేటాయింపు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. విశాఖలో పీవీ సింధు అకాడమీకి భూమిని కేటాయించింది.

PV Sindhu Academy:  పీవీ సింధుకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..  విశాఖలో అకాడమీకి రెండు ఎకరాలు కేటాయింపు

Updated on: May 14, 2021 | 8:13 AM

PV Sindhu Badminton Academy: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. విశాఖలో పీవీ సింధు అకాడమీకి భూమిని కేటాయించింది. ప్రతిభ కలిగిన పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా విశాఖ గ్రామీణ మండలం చినగదిలిలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

చినగదిలిలో 72/11, 83/5, 83/6 సర్వే నంబర్లలో పశు సంవర్థకశాఖకు చెందిన మూడు ఎకరాల్లో రెండు ఎకరాలను క్రీడలు, యువజన వ్యవహారాల శాఖకు.. ఒక ఎకరాన్ని వైద్య ఆరోగ్యశాఖకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఆ రెండు ఎకరాలను పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం ఇస్తున్నట్లు వెల్లడించింది. అకాడమీ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, మూడేళ్ల కాలానికి ఐటీ రిటర్నులు సమర్పించడంతో పాటు నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తి చేశాక ఆ భూమిని పీవీ సింధు బ్యాడ్మింటన్‌ అకాడమీకి అప్పగిస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అకాడమీ నిర్మాణానికి స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పీవీ సింధు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధి కోసం సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని కొనియాడారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్‌ అకాడమీ లేదు. అందుకే అక్కడ అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని భావించానన్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి భూమి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గగానే అకాడమీ నిర్మాణం పనులు మొదలవుతాయి. తొలి దశలో అకాడమీ నిర్మిస్తాం. తర్వాతి దశలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటు ప్రతిపాదన ఉందని సింధు తెలిపారు. నేనింకా ఆడుతున్నా. ఆట నుంచి రిటైరైన తర్వాత అకాడమీలో శిక్షణ బాధ్యతలు చేపడతానని, ప్రభుత్వం అడిగిన అన్ని వివరాలను త్వరలోనే అందజేస్తామని పీవీ సింధు స్పష్టం చేశారు.

Read Also…  Indu Jain: కరోనా మహమ్మారి ధాటికి నేలరాలిన ఆణిముత్యం.. టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ‌జైన్ కన్నుమూత