Dehydration: డీహైడ్రేషన్ అంటే ఏంటి.? ఈ సమస్య ఎందుకు వస్తుంది.?
శరీరంలో తగినంత నీరు లేకపోతే ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడాన్నే డీహైడ్రేషన్ అంటారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో సోడియం, కాల్షియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్‌లు...
మనిషి శరీరం మొత్తం 60 శాతం నీటితో నిండి ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నీటిలో ఉండే సోడియం, కాల్షియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా పనిచేయాలంటే తగినంత నీటి శాతం ఉండాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే మనిషి జీవితంలో నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా పనిచేయాలన్నా రోజులో కనీసం 6 నుంచి 8 గ్లాసుల మంచి నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
ఇక శరీరంలో తగినంత నీరు లేకపోతే ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడాన్నే డీహైడ్రేషన్ అంటారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ అంటే శరీరంలో సోడియం, కాల్షియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్‌లు కూడా తగ్గిపోతున్నట్లేనని భావించాలి. కండరాల పనితీరులో ఈ ఎలక్ట్రోలైట్స్‌దే కీలక పాత్ర కాబట్టి.. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు, ముసలి వాళ్లు, డయాబెటిస్‌తో బాధపడుతోన్న వారు డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి నిల్వలు తక్కువ ఉండడం, దాహం కాకపోవడం, నీటిని క్రమంతప్పకుండా తాగకపోవడం వంటి సమస్యల కారణంగా డీహైడ్రేషన్ సమస్య వస్తుందని హైదరాబాద్ సిటిజెన్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ ఫిషియన్ డాక్టర్ పాపా రావు నందకూడురు తెలిపారు.
పెద్దల్లో డీ హైడ్రేషన్‌కు కారణం…
ముసలివాళ్లలో డీహైడ్రేషన్ సమస్య రావడానికి ప్రధాన కారణం.. వీరు శరీరానికి తగినంత నీటిని తీసుకోకపోవడమే. ముఖ్యంగా రాత్రుళ్లు మూత్ర విసర్జనకు తరచూ లేవాల్సి వస్తుందన్న కారణంతో వీరు సాయంత్రం అయ్యిందటే నీరు తాగడం మానేస్తారు. ఇదే వారిలో డీహైడ్రేషన్‌కు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
చిన్నారుల్లో డీహైడ్రేషన్‌కు కారణం..
చిన్న పిల్లలు పెద్ద వారితో పోల్చితే నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. సహజంగానే నిత్యం యాక్టివ్‌గా ఉంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. కాబట్టి వీరిలో ఎలక్ట్రోలైట్స్ కోల్పోయే శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే జ్వరం, ఇన్ఫెక్షన్స్ కారణంగా కూడా చిన్నారుల్లో డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిక్ బాధితులపై ప్రభావం..
డయాబెటిక్ బారిన పడిన వారు జీవక్రియలో మార్పుల కారణంగా డీహైడ్రేషన్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీరిలో ఎలక్ట్రోలైట్‌లో ఊహించని మార్పులు వస్తాయని చెబుతున్నారు. ఇక మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుందన్న కారణంతో వీరు నీటిని తక్కువగా తీసుకుంటారు. ఇది కూడా వీరిలో డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ ప్రభావం ఎలా ఉంటుంది.?
డీహైడ్రేషన్ సాధారణ సమస్యే అయినప్పటికీ సకాలంలో స్పందించకపోతే మాత్రం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్, వైరల్ వ్యాధులు, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, అతిసారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణంగా మారుతుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డీహైడ్రేషన్ లక్షణాలు..
గొంతు పొడిబారడం, నిత్యం దాహంగా ఉండడం, చర్మం డ్రై అవ్వడం, పేదాలు పగలడం, మూత్రం రంగులో మార్పు రావడం, మూత్ర విసర్జన తగ్గం, తలనొప్పి, కండరాల నొప్పి, శరీరం నీరసించి అనిపించడం వంటి లక్షణాల ఆధారంగా డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. ముసలివాళ్లు, డయాబెటిక్ బాధితుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నోరు పొడిబారడం, దాహం పెరగడం వంటివి కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలని చెబుతున్నారు.
ఇక వాతావారణ పరిస్థితులు కూడా డీహైడ్రేషన్‌కు కారణమవుతంటాయి. వాతావరణం బాగా వేడిగా ఉంటే చెమట రూపంలో శరీరంలోని నీటి శాతం తగ్గుతుందని, ఇది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు. అయితే కేవలం వేడి వాతావరణంలోనే కాకుండా చలి వాతావరణంలో కూడా డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌కు సంబంధించిన లక్షణాలు ఏమున్నా వెంటనే ఎలక్ట్రోలైట్స్ అందించడం, లిక్విడ్‌లను ఎక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..