ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య నగరం రామయ్య జన్మ భూమి మాత్రమే కాదు ఆధ్యాత్మిక క్షేత్రం.. ఇక్కడ రాముడి తో పాటు అనేక మంది దేవతలు ప్రతి రోజూ పూజలను అందుకుంటారు. అయితే యమధర్మ రాజుకి గుడులున్నవి తక్కువే.. పూజించేది కూడా అరుదే.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పూజిస్తారు. మనిషి ఆయుస్సుని, తప్పు ఒప్పులను లెక్కించే జీవుల మరణాన్ని నిర్ణయించే యమ ధర్మ రాజుకి అయోధ్యలో భక్తులు ప్రత్యేక పూజ చేస్తున్నారు. ఏడాదిలో ఒక సారి దీపావళి తర్వాత వచ్చే ద్వితీయ తిథి రోజున యమధర్మ రాజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. యముడు కాలానికి దేవుడిగా భావించి పూజిస్తారు.
అయోధ్యాపురిలోని సరయు నదీ తీరంలో యమతారా ఘాట్ వద్ద యమధర్మరాజు ఆలయం ఉంది. ఈ ఆలయానికి రోజూ ఉండే భక్తుల రద్దీ కంటే యమ ద్వితీయ రోజున భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన యమ ధర్మ రాజుకి పూజలు చేయడం ద్వారా భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. అంతేకాదు దీర్ఘాయుష్షు ప్రసాదించమని వేడుకుంటారు.
సూర్యోదయాన్ని ముందునుంచే సరయు నదిలో భక్తులు స్నానం చేసి దీర్ఘాయుష్షుని కాంక్షిస్తూ యముడిని పూజిస్తారు. ప్రత్యేకించి యమ ద్వితీయ రోజున సోదరీమణులు తమ సోదరుని శ్రేయస్సు , దీర్ఘాయువును కాంక్షిస్తూ యమతార ఘాట్‌లో స్నానం చేసి యమ ధర్మ రాజును పూజిస్తారు. అంతేకాదు ఎవరి జాతకంలో శని దోషం ఉంటే వారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. యమ ధర్మ రాజు తపస్సు చేసి అయోధ్యాదేవిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ కొలువుదీరాడని పురాణాల కథనం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..