Yadadri Temple Specialities: యాదాద్రిలో పునర్నిర్మితమైంది గోపురాలో, ప్రాకారాలో మాత్రమే కాదు.. పల్లవ, చోళ, విజయనగర, కాకతీయ శిల్పకళా రీతులకూ పునఃప్రతిష్ఠ జరిగింది. అవును.. ఐదున్నరేండ్ల పరిమిత కాలంలో శతాబ్దాలనాటి ఓ చిన్న ఆలయ స్వరూపమే మారిపోయింది. అర ఎకరంలోని ప్రాంగణం నాలుగు ఎకరాలకు విస్తరించింది. మూడు గోపురాల గుడి.. సప్త గోపురాలతో సుశోభితమైంది. యాదగిరి గుట్ట.. యాదాద్రి క్షేత్ర నామంతో తెలంగాణ ఆధ్యాత్మిక రాజధానిగా అవతరించింది. యాదాద్రిలో అణువణువూ నృసింహ స్వరూపమే. చెట్టు, పుట్ట, గాలి, నీరు.. ‘ఇందుగలడందులేడని సందేహము వలదు’ అంటూ స్వామి అనంతత్వాన్ని చాటి చెబుతాయి.
ఘాట్ రోడ్డు మీదుగా నర్సన్న దర్శనానికి విచ్చేసే భక్తులకు తొలుత అంతెత్తు తోరణం స్వాగతం పలికి.. భక్తి సామ్రాజ్య పౌరసత్వాన్ని ప్రసాదిస్తుంది. మరుక్షణం నుంచీ ముక్కోటి దేవతలూ, నారదాది మహర్షులూ.. మన సహ యాత్రికులు అవుతారు. సూక్ష్మ-స్థూల శరీరాలతోనో, దృశ్య-అదృశ్య రూపాలతోనో మనతో కలిసి పరమాత్మను దర్శించుకుంటారు. ప్రధాన ఆలయ ఆవరణలో అడుగుపెట్టిన మరుక్షణం.. వైకుంఠపురిలో ప్రవేశించిన అనుభూతిని పొందుతాం. యాదాద్రి ఇలవైకుంఠమే! ఆలయంలోని ప్రతి శిల్పం.. హరి తత్వాన్ని చాటుతుంది. ప్రతి నిర్మాణం నరహరి లీలలను వినిపిస్తుంది. అడుగడుగునా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ, అణువణువునా శరణాగతిని నింపుకొంటూ.. అడుగు ముందుకేస్తూ ఆద్యంతరహితుడి కటాక్షం పొందేలా ఉంది. రెండున్నర లక్షల టన్నుల కృష్ణా శిలలతో సప్త గోపురాలు నిర్మించారు. త్రితల, పంచతల, సప్తతల గోపురాలుగా శిల్ప సౌందర్యంతో అలరిస్తున్నాయి.
Also read:
Gold Mines: రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు.. పది చోట్ల గుర్తించిన పరిశోధకులు.. ఆ ప్రాంతాలేంటంటే..!
PM Modi: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో ఆరు నెలలు పూర్తి ఉచితం..