
హిందూ ధర్మంలో ప్రతి దేవతకు ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. అదే విధంగా శివుడి ఆరాధనలో కొన్ని నియమాలు శతాబ్దాలుగా అనుసరించబడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది.. శివలింగానికి తులసి సమర్పించకూడదు అనే సంప్రదాయం. దీనికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, పురాణ కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాలలో చెప్పినట్టు, తులసి దేవి ఒక జన్మలో వృంద అనే మహా పతివ్రతగా జన్మించింది. ఆమె గొప్ప విష్ణు భక్తురాలు. అయితే, ఆమె భర్త జలంధరాసురుడు. వృందను జలంధరాసురుడు బలవంతంగా వివాహం చేసుకున్నాడు. అయితే, దేవతలను హింసిస్తున్న జలంధరాసురుడిని ఓడించేందుకు విష్ణువు మాయ రూపం దాల్చాడు. విష్ణువు తన మాయ ద్వారా వృంద యొక్క పతివ్రతను భంగం చేశారు. దీంతో ఆగ్రహించిన ఆమె.. తన ఆరాధ్య దైవమైనప్పటికీ.. మహా విష్ణువును శపిస్తుంది. శాపం కారణంగా విష్ణువు శిలగా మారాడు. అదే శాలగ్రామం. అనంతరం వృంద తులసిగా అవతరించింది. ఆ కారణంగా తులసి దేవి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైనదిగా మారింది. విష్ణు భక్తికి తులసి విడదీయరాని భాగంగా మారింది.
శివుడు వైరాగ్యం, త్యాగం, సంయమనంకి ప్రతిరూపం. ఆయనకు ఇష్టమైనవి.. బిల్వ పత్రం, భస్మం, ధత్తూర, నెయ్యి, జలం.
ఇక, తులసి మాత్రం గృహస్థ ధర్మం, సాత్విక గుణం, విష్ణు భక్తికి సూచికగా భావిస్తారు. అందుకే శివ–విష్ణు తత్త్వాల మధ్య భిన్నతను సూచించేలా ఈ సంప్రదాయం ఏర్పడిందని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు.
శైవ సంప్రదాయంలో తులసిని శివార్చనలో ఉపయోగించరు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో బిల్వ పత్రాన్ని విష్ణు పూజలో ఉపయోగించరు. ఇది దేవతల మధ్య విరోధం కాదు.. తత్త్వ భేదాన్ని గౌరవించే విధానం మాత్రమే.
అగమ శాస్త్రాలు, శైవ పూజా విధాన గ్రంథాల ప్రకారం కూడా శివలింగార్చనకు తులసి అనర్హమని పేర్కొనబడింది. అయితే భక్తి ముఖ్యమని చెప్పే కొంతమంది ఆధ్యాత్మిక గురువులు.. అజ్ఞానంతో సమర్పించినదాన్ని శివుడు తిరస్కరించడు అని కూడా అంటారు.
శివుడికి తులసి సమర్పించకూడదన్నది భయం లేదా నిషేధం కాదు. అది సాంప్రదాయానికి, తత్త్వానికి ఇచ్చే గౌరవం. శివ భక్తులకు బిల్వదళం సమర్పించడం అత్యుత్తమమైన మార్గంగా శాస్త్రాలు సూచిస్తున్నాయి. భక్తిలో భావమే ప్రధానం.. కానీ సంప్రదాయాన్ని తెలుసుకుని ఆచరించడం ఆధ్యాత్మిక పరిపక్వతకు సూచిక.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందుబాటులోని వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)