దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు? ఈ అద్భుతం తెలుసుకోండి

ఆధ్మాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ప్రసంగాల వీడియోలు సోషల్ మీడియోలో వేగంగా వైరల్ అవుతుంటాయి. దేవుడు, కర్మ, మానవ స్వేచ్ఛ గురించి చాలా సాధారణమైన ప్రశ్నలకు లోతైన సమాధానాలు ఇస్తారు. దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆయన మనల్ని తప్పు చేయకుండా ఎందుకు ఆపడం లేదు? అనే ప్రశ్నకు ఆయన అద్భుతమైన సమాధానం ఇచ్చారు.

దేవుడు మనల్ని పాపం చేయకుండా ఎందుకు ఆపడు? ఈ అద్భుతం తెలుసుకోండి
God Spiritual

Updated on: Jan 11, 2026 | 4:17 PM

నేటి సమాజంలో ఒక వ్యక్తి దు:ఖంతో ఉన్నప్పుడు లేదా సమాజంలో చెడును చూసినప్పుడల్లా వారి మనస్సులో తప్పనిసరిగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. దేవుడు మనందరినీ గమనిస్తూ ఉంటే.. మనం ఆయన పిల్లలమే అయితే.. ఆయన మనల్ని తప్పు చేయకుండా ఎందుకు ఆపడం లేదు? అనే ప్రశ్నను ఇటీవల ఓ భక్తుడు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్‌ను అడిగాడు. ఇందుకు స్వామిజీ ఇచ్చిన సమాధానం తార్కికం మాత్రమే కాదు, జీవితాన్ని కూడా మారుస్తుంది.

భక్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే..?
ఒక భక్తుడు ప్రేమానంద మహారాజ్ దగ్గరికి వచ్చి తన సందిగ్ధతను ప్రశ్నగా వ్యక్తం చేస్తూ.. ‘మహారాజ్ జీ, మనం దేవునిలో ఒక భాగమని, ఆయన మన తండ్రి అని మీరు అంటున్నారు. అలాంటప్పుడు ఆయన మనకు తప్పు చేయడానికి ఎందుకు అధికారం ఇస్తాడు. మనం తప్పుడు మార్గంలో వెళుతున్నామని ఆయనకు తెలిసినప్పుడు, ఆయన మన చేయి పట్టుకుని ఎందుకు ఆపడు?’ అని అడిగాడు.

ప్రేమానంద్ మహారాజ్ అద్భుత సమాధానం

ఆ భక్తుడి ప్రశ్నకు ప్రేమానంద్ మహారాజ్ అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ‘ఎవరైనా మీకు రూ. 100 ఇచ్చి మార్కెట్‌కు పంపారని అనుకుందాం. ఇప్పుడు మీరు ఆ డబ్బును పండ్లు, స్వీట్లు కొనడానికి ఉపయోగించాలా? లేదా జూదం, మద్యం వంటి దుర్గుణాలకు ఖర్చు చేయాలా? అనేది పూర్తి మీ ఇష్టం. ఇచ్చే వ్యక్తి మీకు ఒక మార్గం(మూలధనం) ఇచ్చాడు. దాన్ని ఎలా ఉపయోగించాలో మీ ఇష్టం’ అని తెలియజేశారు.

మనస్సాక్షి నిజమైన మార్గదర్శి

దేవుడు మానవులకు చేతులు, కాళ్లు, వాక్కు, అన్నింటికంటే ముఖ్యంగా మనస్సాక్షి(వివేకం-ఆలోచించే, అర్థం చేసుకునే శక్తి) ఇచ్చాడని ప్రేమానంద మహారాజ్ వివరించారు. ఇది దైవిక ఆస్తి.

మాట్లాడే ఎంపిక:
మీకు మాట్లాడే శక్తి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మీరు ఆ శక్తిని ఇతరులను శపించడానికి (తిట్టడం) ఉపయోగించాలా? లేదా భగవంతుడిని నామాన్ని జపించాలా? అనేది మీ ఇష్టం అని ఆయన తెలిపారు.

ఇంద్రియాలను సరిగ్గా ఉపయోగించడం:
దేవుడు మీకు కళ్లను ఇచ్చాడు. దాంతో మీరు అశ్లీలతను చూడవచ్చు లేదా దేవుడినీ చూడవచ్చు. దేవుడు ఇచ్చిన చేతులను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు లేదా హాని చేయవచ్చు. అది మీ వివేకాన్ని బట్టి ఉంటుంది.

మానవ జన్మ నిజమైన ఉద్దేశం

ప్రేమానంద్ మహారాజ్ ప్రకారం.. మనం మన గత తప్పులను, చెడు అలవాట్లను సరిదిద్దుకోవడానికి మనుషులుగా జన్మించాం. దేవుడు మనకు చర్య తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. దేవుడు మనల్ని రోబోల వలె నియంత్రిస్తే.. పాపం, పుణ్యం అర్ధరహితంగా మారతాయి.

దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. అది మనం ఏదైనా తప్పు చేసే ముందు మనల్ని హెచ్చరిస్తుంది. మనం ‘మనస్సాక్షి స్వరం’ అని పిలుస్తున్నది దేవుడు మనల్ని అదుపులో ఉంచే మార్గం. కానీ, మనం ఆ స్వరాన్ని విస్మరిస్తే.. అది మన సంకల్ప శక్తి లేకపోవడానికి సంకేతంగా మారుతుంది. కాబట్టి, ఈ దైవిక శక్తిని మంచి పనుల కోసం ఉపయోగించడం మనిషి విధి. దేవుడు మార్గం చూపిస్తాడు.. కానీ, ఆ మార్గాన్ని అనుసరించాలా? వద్దా? అనేది పూర్తిగా మనిషి చేతుల్లోనే ఉంటుంది అని ప్రేమానంద్ మహారాజ్ స్పష్టం చేశారు.