వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి సంబంధించి కొన్ని నియమాలున్నాయి. ఇంటి ప్రధాన ద్వారం అందం కోసం చేసే అలంకరణ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. ముఖ్యంగా ప్రధాన ద్వారం వద్ద ప్రతిష్టించే వినాయక విగ్రహం విషయంలో కూడా కొన్ని పద్దతులున్నాయి. ప్రధాన ద్వారం వద్ద రెండు వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలి. ఈ విగ్రహాల్లో ఒకటి బయటికి కనిపించేలా ఎదురుగా.. మరొకటి లోపలికి కనిపించేలా ఎదురుగా ఉండాలి. పురాణ మత గ్రంథాల్లో గణేశుడిని వెనుక నుండి చూడటం నిషేధించబడింది.
గణేశుడి వెనుక జేష్టాదేవి నివాసం అని నమ్మకం. జేష్టాదేవి పేదరికానికి అధిదేవత కనుక ఎవరైనా సరే గజాననుని వెనుక వైపు నుంచి దర్శనం చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు, పేదరికం ఉంటాయని విశ్వాసం. గణేశుడి వెనుక భాగం కనిపించేలా ప్రతిష్టించరు. ఎందుకంటే అలా వెనుక వైపు కనిపించేలా ప్రతిష్ఠిస్తే.. కష్టాలు వస్తాయని.. పనిలో ఆటంకాలు ఏర్పడతాయని నమ్మకం. అందువల్ల సిద్ధి- బుద్ధి మీ ఇంటిలో ప్రవేశించడానికి వీలుగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న గణేష్ విగ్రహం వెనుక.. అలాంటిదే మరొక గణేష్ విగ్రహాన్ని లోపల ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తారు.
గణేశుడి తొండం మీద ధర్మం ఉంటుంది. అతని చెవులపై శ్లోకాలు ఉన్నాయి. దేవీ.. దేవతలు గణేశుడి శరీరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారని నమ్ముతారు. అందుకే గణేశుడి దర్శనం వల్ల సుఖశాంతులు, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని చెబుతారు. ఎవరైనా గణేశుడి వెనుక భాగాన్ని చూస్తే.. అతను నొప్పితో బాధపడవలసి ఉంటుంది. కనుకనే గణపతి వెనుకవైపు చూడకూడదు. ఎవరైనా అనుకోకుండా వినాయకుని వెనుక భాగాన్ని చూస్తే.. గణపతిని పూజించి క్షమించమని కోరుకోవాలి.
ఎవరైనా శ్రీకృష్ణుడు, విష్ణువు లేదా గణేశుని వీపు దర్శనం చేసుకున్నప్పుడు.. ఆ వ్యక్తి చేసిన పుణ్య ప్రభావం తగ్గుతుంది.. చెడు ప్రభావం పెరుగుతుందని గ్రంధాలలో పేర్కొనబడింది. ఈ కారణంగా గణపతి, శ్రీ కృష్ణుడిని, శ్రీ మహా విష్ణువు వీపుల దర్శనం చేసుకోవడం నివారింపబడింది. అంతేకాదు ఈ దేవతల ఆలయాన్ని సందర్శించేటప్పుడు విగ్రహాల వైపు వెనుకకు దృష్టి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. ఆలయంలో విగ్రహం వీపుని దర్శనం చేసుకున్నట్లు అయితే జ్ఞానం, సంపద రెండింటినీ కోల్పోతారని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.