దేశంలోని ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడ విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌లు అక్కడ చిక్కుకుపోయారు.
హిమాలయాల్లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని శీతాకాలం సందర్భంగా సోమవారం నుంచి మూసివేయనున్న నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు త్రివేంద్ర సింగ్ రావత్, యోగి ఆదిత్యనాథ్ లు ఆదివారం అర్దరాత్రి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల ప్రకారం కేదార్‌నాథ్ ఆలయ పునర్ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా భక్తుల కోసం 40 గదుల పర్యాటక అతిథిగృహానికి శంకుస్థాపన చేయడానికి ఇరువురూ ఆదివారం వెళ్లారు. కేదార్‌నాథ్‌లో విపరీతంగా మంచు కురువడంతో ఆ ప్రాంతం మంచు పేరుకుపోయింది. రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగడంతో ఆలయాన్ని మూసివేశారు.
శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగానే ముఖ్యమంత్రులు ఇద్దరూ అక్కడి నుంచి తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి. మళ్లీ వాతావరణం సాధారణ స్థితికి వచ్చేంత వరకు హెలికాప్టర్ సేవలను కొనసాగించే పరిస్థితి లేదు. దీంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ అక్కడే చిక్కుకుపోయారు.
కాగా, ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల వల్ల ఆ ప్రాంతమంతా విపరీతమై మంచు దుప్పటి కప్పేసింది. పరిస్థితి కుదుటపడిన తర్వాత ఇరువురూ బదరీనాథ్ చేరుకుంటారు. యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2018లో కేదార్‌నాథ్‌ను సందర్శించిన యోగి ఆదిత్యనాథ్.. టూరిజం గెస్ట్‌హౌస్ కట్టిస్తామని ప్రకటించారు.