TTD: తిరుమల బ్రహ్మత్సవాలు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం.. సెప్టెంబర్ 27 న అంకురార్పణ

|

Aug 05, 2022 | 8:22 AM

కలియుగ వైకుఠనాథుడు తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంటోంది. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు (Brahmotsava) నిర్వహించేందుకు టీటీడీ (TTD) సిద్ధమైంది...

TTD: తిరుమల బ్రహ్మత్సవాలు ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం.. సెప్టెంబర్ 27 న అంకురార్పణ
Ttd
Follow us on

కలియుగ వైకుఠనాథుడు తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంటోంది. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు (Brahmotsava) నిర్వహించేందుకు టీటీడీ (TTD) సిద్ధమైంది. సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఛైర్మన్‌ సమక్షంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్‌ 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మినహా… అన్ని రకాల దర్శనాలు రద్దు చేశామని టీటీడీ వెల్లడించింది. లక్షల సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారన్న అంచనాతో వసతి సౌకర్యాల్లో ఎటువంటి లోటుపాట్లూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడసేవ రోజు కొండపై అధిక రద్దీ ఉంటుంది. అందుకే ఘాట్‌ రోడ్లలో టూ వీలర్లను అనుమతించేది లేదని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. తిరుమల గిరులపై సామాజిక సమతుల్యత పాటిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా ప్రదర్శనలు ఇచ్చేందుకు గిరిజన కళాకారులకు అవకాశం కల్పించారు.

కాగా.. తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 27 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. కరోనాతో రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. అయితే.. ఈ సారి కరోనా కేసుల సంఖ్య తగ్గడం, వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అక్టోబరు 1న గరుడ సేవ, 2న బంగారు రథం, 4న మహారథం, 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

కాగా.. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని ఆధ్యాత్మిక కథనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..