తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు!

Tiruvannamalai Idukku Pillayar Temple: తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రత కోసం రాతి చీలిక గుండా వెళ్లే వారికి కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఫిట్‌నెస్ తనిఖీ కూడా ప్రారంభించింది.

తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు!
Tiruvannamalai Idukku Pillayar Temple

Updated on: Aug 07, 2026 | 8:36 PM

Tiruvannamalai Idukku Pillayar Temple Telugu: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి చెందిన 14 కిలోమీటర్ల గిరివాల మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్ళయార్ ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ఇరుకైన రాతి చీలిక గుండా వెళ్లి గణేశుడిని దర్శించుకుంటే జీవితంలోని ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న రెండు ఘటనలు ఆలయ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ భక్తుడు రాతి చీలిక గుండా వెళ్తుండగా అకస్మాత్తుగా ఊపిరాడక కుప్పకూలి మృతిచెందాడు. అనంతరం అదే ప్రాంతంలో ఓ మహిళా భక్తురాలు రాతి చీలికలో చిక్కుకుపోవడంతో అక్కడున్న వారు ఎంతో శ్రమించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.

భక్తుల భద్రత కోసం కొత్త నిబంధనలు

ఈ ఘటనల నేపథ్యంలో అన్నామలైయార్ ఆలయ పరిపాలన భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ఊబకాయం ఉన్నవారు, వృద్ధులు, గుండె సంబంధిత వ్యాధులు, ఆయాసం లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్న భక్తులను రాతి చీలిక గుండా వెళ్లేందుకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తమిళం, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

ఇనుప కడ్డీలతో ఫిట్‌నెస్ తనిఖీ

ప్రమాదాలను నివారించేందుకు ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా ఇనుప కడ్డీలతో తనిఖీ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కడ్డీల మధ్య నుంచి సులభంగా వెళ్లగలిగే భక్తులను మాత్రమే రాతి చీలికలోకి అనుమతిస్తున్నారు. దీని ద్వారా శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నవారిని ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు ఆలయ యంత్రాంగం చర్యలు చేపట్టింది.

ఇవి కూడా చదవండి

దర్శన సమయాలు

పౌర్ణమి రోజులు మినహా మిగతా రోజులలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ జాయింట్ కమిషనర్ ప్రణితరణ్ వెల్లడించారు. భక్తులు తమ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us