Snapana Tirumanjanam: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలో జాజి పత్రి, పిస్తా, కర్జూరం, పన్నీరు ఆకు, ఎండు ద్రాక్ష, రోజా పువ్వు రేకులతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేద మంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ వాసుదేవ భట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో వివిధ రకాల మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు కనువిందు చేశారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తుండగా, ప్రత్యేక మాలలను అలంకరించారు. జాజి పత్రి, పిస్తా, కర్జూరం – పన్నీరు ఆకు, ఎండు ద్రాక్ష, రోజా పువ్వు రేకులతో, బ్లూకలర్ పవిత్ర మాలలు, వట్టి వేరు, తులసితో తయారు చేసిన మాలలు అలంకరించామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
తామర పువ్వుల మండపం
స్నపనతిరుమంజనం నిర్వహించే రంగ నాయకుల మండపంలో తామర పువ్వు ఆకారంలో వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలు, ఆస్ట్రేలియా బత్తాయి, ద్రాక్ష గుత్తులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ స్నపన తిరుమంజనం కమనీయంగా సాగింది. చెన్నైకి చెందిన దాత త్రిలోక్ చందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు, స్నపన మండపం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 20 మంది నైపుణ్యం గల నిపుణులు మూడు రోజుల పాటు శ్రమించి తామర పువ్వు ఆకారంలో మండపాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: అంతరించిపోతున్న అందమైన పింక్ ఫెయిరీ ఆర్మడిల్లో.. ఇసుకలో ఈదడం, పిల్లలకు పాలివ్వడం దీని స్పెషాల్టీ..