Thirumala seven hills : తిరుమలలోని సప్తగిరులు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. అసలే కళ్లు తిప్పనివ్వని సోయగాలకు నెలవు ఏడుకొండలు. ఆకు పచ్చని చెట్లతో, పూల మొక్కలతో స్వచ్చమైన చల్లగాలితో మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి తిరుమలకొండలు. తాజాగా పొగమంచుతో మరింత అందాన్ని నింపుకున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డుకు చుట్టు పక్కల పొగమంచు కనువిందు చేయడంతో భక్తులు ఆనందపారవశ్యంలో మునిగితేలారు. ఘాట్ రోడ్డు చుట్టూ శ్వేతవర్ణం పరుచుకున్న తిరుమలగిరుల సోయగాన్ని తమ నయనాల్లో నింపుకున్నారు భక్తులు. సాధారణంగా సప్తగిరుల్లో సప్తవర్ణాలు కనిపిస్తాయి. అందమైన చెట్లు, పూల మొక్కలతో పాటు నెమళ్లు, జింకల లాంటి జంతువులు భక్తులకు కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఏడుకొండలు మొత్తం పొగమంచు పరుచుకోవడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుమలలో మొదట వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు భక్తులు. అయితే ఈ మహిమాన్విత ప్రదేశంలో దర్శించాల్సిన ప్రదేశాలు మరెన్నో ఉన్నాయి. కలియుగ దైవం చుట్టూ ఎన్నో మరెన్నో దర్శనీయ ప్రదేశాలు, ప్రకృతితో మమేకమయ్యి విశ్వమంతానిండి ఉన్న ఆ మహా రూపానికి దగ్గరగా మనలని తీసుకు వెళ్ళిన అనుభూతినిచ్చే ప్రదేశాలున్నాయి. తిరుమలలో వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఆలయం, గోవిందరాజ స్వామి దేవాలయం, శ్రీనివాస మంగాపురం లాంటి ప్రసిద్ధ చెందిప గుళ్ళతో పాటు వివిధ పశు, వృక్ష జాతులకు ఆవాసమైన ఇక్కడి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ కూడా చూడవచ్చు.
శిలాతోరణం అనే ఇక్కడి రాతి ఉద్యానవనాన్ని కూడా భక్తులకు మధురానుభూతిని మిగుల్చుతుంది. తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల దగ్గర పర్వత ప్రదేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం నంది ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు. తిరుమలలో కపిలతీర్థం, శిలాతోరణం, ఆకాశగంగా, చక్రతీర్థం, పాపవినాశం, పుష్కరిణి, తుంబురు తీర్థం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, టీటీడీ గార్డెన్ ఇలా అనేక పర్యాటక ప్రదేశాలు ఉండగా, ఇప్పుడు పొగమంచు కూడా మరో ఆకర్షణగా మారింది. పొగమంచుతో భక్తులు ఆనందంతో పరవశించిపోతున్నారు.