Goddess Lakshmi: మీ ఇంట్లో లక్ష్మీ దేవి తిష్ట వేయాలంటే ఇలా చేయండి…!

మారేడు చెట్టుకు పూజ చేస్తే.. మనసుకు శాంతి, శరీరానికి ఆరోగ్యం, ఇంటికి ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడు ఐశ్వర్యప్రదాత కాబట్టి, ఆయన్ని ఆయనకు ప్రీతికరమైన మారేడు ఆకులతో పూజిస్తే సకల సంపదలు సొంతమవుతాయని ఆధ్యాత్మిక పండితుల నమ్మకం. .. ..

Goddess Lakshmi: మీ ఇంట్లో లక్ష్మీ దేవి తిష్ట వేయాలంటే ఇలా చేయండి...!
Goddess Lakshmi

Updated on: Oct 26, 2025 | 3:14 PM

పవిత్ర వృక్షాలలో మారేడు చెట్టు అత్యంత విశిష్టమైనది. ఈ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరం. మారేడు ఆకులతో భక్తితో శివపూజ చేస్తే మనసులో కోరుకున్న కోరికలు నెరవేరతాయని పురాణాలు చెబుతున్నాయి.మారేడు దళం మూడు భాగాలు.. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ప్రతీకలు. ఇవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సూచిస్తాయి. ఇవే శివస్వరూపం. మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారేడు దళం ఆవిర్భవించిందని చెబుతారు. అందుకే ఈ దళం శివునికి మరింత ప్రీతికరమైనదిగా భావిస్తారు.

భక్తితో మారేడు చెట్టును ప్రదక్షిణలు చేయడం, చెట్టును తాకడం.. శివుడిని స్వయంగా స్పర్శించినట్లుగా ఫలితాన్నిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే పూజించిన మారేడు దళాన్ని పర్సులో, బీరువాలో లేదా క్యాష్ బాక్స్‌లో ఉంచుకోవాలని పండితులు సూచిస్తారు. ఆ తరువాత ఇష్టదైవాన్ని నమస్కరించి, లక్ష్మీదేవి స్తోత్రం పారాయణం చేయాలి. చినుగులు లేని రెండు మారేడు దళాలు తెచ్చుకుని ఒకదానిని బీరువాలో, మరొకదానిని ప్యాకెట్లో ఉంచితే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది.

రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు వద్ద పూజ చేయడం అత్యంత శుభప్రదం. ఆ రోజు సూర్యోదయం తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమయ్యే సమయానికి మారేడు చెట్టుకు నీరు పోసి, ఆవు నేతితో దీపారాధన చేయాలి. గంధపు వాసనతో అగరబత్తులు వెలిగించి, చెట్టు కింద కూర్చుని మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి. తమలపాకు, వక్కలు, అరటిపండ్లు, దక్షిణ రూపంలో ఐదు రూపాయలు ఉంచి పూజ చేస్తే సకల పాపాలు నశించి ఐశ్వర్యం చేకూరుతుంది. హుండీలో 11 రూపాయలు వేసి పూజ పూర్తి చేస్తే మరింత శుభం కలుగుతుంది. ఆ రోజు తీసుకొచ్చిన మారేడు దళాన్ని క్యాష్‌బాక్స్‌లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం. రోహిణి నక్షత్రం చంద్రునికి చెందింది, చంద్రునికి ఆధిపత్య దేవత మహాలక్ష్మి. అందుకే ఈ రోజు చేసిన మారేడు పూజ ఐశ్వర్యాన్ని స్థిరపరుస్తుంది.

మారేడు వృక్షం ఆధ్యాత్మిక విలువలతో పాటు వైద్యప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. బిల్వపత్రాలు వాయువును, నీటిని శుభ్రపరుస్తాయి. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి మేలు చేస్తుంది. ప్రతిరోజూ మారేడు చెట్టు నీడలో కొంతసేపు గడిపితే దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బిల్వ ఆకుల రసం శరీరానికి పూసుకుంటే చెమట వాసన తొలగిపోతుంది. వేరును నూరి తేనెతో కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. కళ్లపై బిల్వ రసం లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు నశిస్తాయి. బిల్వ చూర్ణం అతిసారాన్ని తగ్గిస్తుంది, శరీరాన్ని బలంగా ఉంచుతుంది.

(ఈ అంశాలు పండితుల నుంచి సేకరించబడింది. సమాచారాన్ని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు)