
ఈ జనరేషన్ యువత కొందరు పెళ్లి అనే మాట వినడానికి ఇష్టపడటం లేదు. బాబోయ్.. ఈ సంసార సాగరాన్ని మేం ఈదలేం అంటున్నారు. 30 దాటినా ఇప్పటికే చాలామంది సింగిల్‌గానే ఉంటున్నారు. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఓ ప్రవచనంలో వివాహ ప్రాముఖ్యతను వివరించారు. వివాహం కేవలం సామాజిక సంప్రదాయం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంస్కారం అన్నారు. ఈ ప్రవచనంలో.. ఆయన మూడు ప్రధానమైన ఋణాలను తీర్చుకోవడంలో వివాహం పోషించే పాత్రను వివరించారు. మొదటిది పితృఋణం. తల్లిదండ్రులు తమ పిల్లలకు శరీరాన్ని ఇచ్చినట్లు, వారు కూడా వేరొకరికి జీవితాన్ని ఇవ్వాలి. అందుకే వివాహం ద్వారా సంతానం పొందడం అవసరం. మహాభారతంలోని జరత్కారు ఉపాఖ్యానం ద్వారా ఈ విషయాన్ని ఆయన సమర్థించారు. జరత్కారు పెళ్లి చేసుకోకపోవడం వల్ల, ఆయన తల్లిదండ్రులు, వంశీయులు కష్టాలను అనుభవించారని మహాభారతం ఆదిపర్వం వివరిస్తుందని ఆయన తెలిపారు.
రెండవది ఋషిఋణం. ఋషులు నిస్వార్థంగా మనకు వేదాలు, ఇతిహాసాలను అందించారు. జాతి హితం కోసం వాటిని అధ్యయనం చేయడం ద్వారా మనం ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి. కానీ వేదాధ్యయనం చేయడానికి ఒక గృహస్థునికి భార్య సహాయం ఎంతో అవసరం. ఆమె ఇంటిని, పిల్లలను చూసుకుంటూ, భర్తకు వేదాధ్యయనం చేయడానికి సహాయపడుతుంది అన్నారు.
మూడవది దేవఋణం. దేవతల అనుగ్రహం చేతనే మనం జీవించగలుగుతున్నాం. యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా మనం దేవ ఋణాన్ని తీర్చుకోవాలి. ఈ క్రతువులను ధర్మపత్నితో కలిసి చేయడం ద్వారా మరింత పుణ్యఫలం లభిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారి ఈ ప్రవచనం మన జీవితంలో వివాహం ప్రాముఖ్యతను బలంగా నొక్కి చెబుతుంది. ఇది కేవలం సంతానోత్పత్తికే కాదు, మన ధర్మాన్ని నెరవేర్చడానికి, మూడు ఋణాలను తీర్చుకోవడానికి అత్యవసరమైనది అని ఆయన అభిప్రాయం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..