CM KCR Yadadri visit today: తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రి ఆలయ(Yadadri Temple) అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ మరోసారి పరిశీలించనున్నారు. మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం(Government) ముహూర్తం నిర్ణయించింది. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లను అధికారులతో సమీక్షించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే, పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం.
యాదాద్రి లక్షీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా పునర్‌నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తొలినుంచీ ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించారు సీఎం కేసీఆర్. కొండపైన, కింద అభివృద్ధి పనులు చేపట్టారు. అవన్నీ దాదాపు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల ఫినిషింగ్ టచ్‌లో ఉన్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్.. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. స్వామివారి దర్శనం తర్వాత క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ముగింపు దశలో ఉన్న పునర్నిర్మాణ పనుల పరిశీలిస్తారు. మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం జరుగుతుంది. గుట్టపై యాగస్థలి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తిశ్రద్ధలతో, పూర్తి శాస్ర్తోక్తంగా జరగనున్న మహా సంప్రోక్షణకు సమయం సమీపిస్తున్న తరుణంలో యాదాద్రి వెళ్లి.. స్వయంగా పనులను పరిశీలించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తుది మెరుగుల దృష్ట్యా అధికారులకు దిశా నిర్దేశం చేస్తారు.
దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చలు జరుపనున్నారు. కాగా, సీఎం పర్యటన దృష్ట్యా వైటీడీఏ అధికారులు అన్ని ఏర్పాట్ల పూర్తి చేశారు. మరోవైపు, యాదాద్రిలో భారీ బందోబస్తుతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుంటే, దేశంలో అద్భుతమైన పర్యాటక పుణ్యక్షేత్రంగా యాదాద్రిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పునర్ నిర్మిస్తోంది ప్రభుత్వం. 2014లో ప్రారంభించిన యాదాద్రి ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం. ఇందుకోసం దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. సీఎం కేసీఆర్ నిరంతరం ఈ పనులను పర్యవేక్షిస్తూ… అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
Read Also…. AP CM Jagan Visit Muchintal: నేడు ముచ్చింతల్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్.. యాగశాలలో ఈ రోజు కార్యక్రమాలు ఏంటంటే..?