
తిరుపతిలోని గంగమ్మను తిరుమల శ్రీవారి సోదరిగా, తిరుపతి గ్రామ దేవతగా భావించే భక్తులు ఎన్నో ఏళ్లుగా ఆ తల్లిని పూజిస్తూ వస్తున్నారు.తిరుపతి గంగమ్మ జాతర ఒకటో శతాబ్దం నుంచి జరుగుతున్నట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న ఈ గంగమ్మ జాతరను ప్రతి ఏడాది మే నెలలో వారం రోజుల పాటు నిర్వహిస్తారు. స్థానిక ప్రజలు చిత్ర విచిత్రాల వేషాలతో గంగమ్మను దర్శించుకుంటారు. బూతులు తిడుతూ మొక్కలు తీర్చుకోవడం తిరుపతిలో తప్పా దేశంలో ఎక్కడా లేని సాంప్రదాయం. వారం రోజులు పాటు జరిగే జాతరలో మొదటి మూడు రోజులు బూతులు తిడుతూ విచిత్ర వేషాలు వేసే భక్తులు జానపద, సాంఘిక, పౌరాణిక వేషాలతో అమ్మ వారి మొక్కులు చెల్లించడం అనవాయితీ.
అయితే, తిరుపతి తమిళనాడు, కర్ణాటకకు సరిహద్దు ప్రాంతంగా ఉండడంతో తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరకు ఆయా రాష్ట్రాల భక్తుడు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇలా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరొందిన గంగమ్మ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్‌గా ప్రతియేటా నిర్వహిస్తోంది. అయితే ఈ జాతర ప్రత్యేకతను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం తిరుపతి గంగమ్మ జాతరకు తమ రాష్ట్రంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. జానపద సాహిత్యంతో కూడిన గంగ జాతరను తమిళనాడులోని పదో తరగతి తెలుగు రీడర్ పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చింది.తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పేట శ్రీనివాసులు రెడ్డి రాసిన గంగజాతర పుస్తకాన్ని పాఠ్యాంశంగా ముద్రించిన తమిళనాడు సర్కార్ అరుదైన గౌరవాన్ని కల్పించింది.
తమ రాష్ట్రంలోని పాఠ్యపుస్తకాలలో గంగజాతరను చేర్చి జానపద సాహిత్యాన్ని ఆదరించిన తమిళనాడు ప్రభుత్వానికి రచయిత పేటశ్రీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రామీణ సంస్కృతి భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ దేవతలు, జాతర సంస్కృతి విద్యార్థులకు తెలిసేలా తమిళనాడు ప్రభుత్వం చొరవ చూపడం అభినందనీయమని కొనియాడారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..