Swami Govindananda Saraswati on TTD: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)పై హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పాలకమండలి దైవద్రోహం చేస్తోందని గోవిందానంద సరస్వతీ ఆరోపించారు. తిరుమల(Tirumala)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… హనుమంతుడి జన్మస్థలం(Hunuman Birth) పేరిట టీటీడీ నకిలీ పుస్తకం ముద్రించి, తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సన్యాసులను, చరిత్రకారులను, ప్రజలను టీటీడీ మోసం చేస్తోందని, అంజనాద్రి పేరుతో తిరుమలలో దుకాణాలు ఏర్పాటు చేయడానికి, టీటీడీ ప్రయత్నాలు జరుపుతున్నారని విమర్శించారు.
డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, రూ.1200 కోట్లతో కిష్కింద అభివృద్ధికి కర్ణాటక సీఎం ఇప్పటికే ప్రకటన చేశారని, కిష్కిందలోని పంపా తీరంలోనే హనుమంతుడు పుట్టాడని అందరూ అంగీకరించారని గోవిందానంద సరస్వతీ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా అక్కడకు వెళ్లి ఈ విషయాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. టీటీడీకి చెందిన పాలకమండలి మాత్రం హనుమంతుడి జన్మస్థలం విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారం చేస్తూ దైవ ద్రోహం చేస్తున్నారని, సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే వారిని వదిలిపెట్టబోమని గోవిందానంద సరస్వతీ హెచ్చరించారు.
Read Also… Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళాకు మొదలైన భక్తుల తాకిడి.. ఈనెల 18న మేడారం జాతరకు సీఎం కేసీఆర్