Arasavilli Temple: ఈ సారి నిరాశే.. భక్తులకు కనిపించని అరుదైన దృశ్యం

|

Mar 09, 2022 | 11:42 AM

అరుదైన ఘట్టాన్ని వీక్షించేందుకు ఎదురుచూస్తున్న భక్తులకు ఈసారి నిరాశే మిగిలింది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి(Arasavilli) సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకలేదు. ఆకాశం మేఘావృతం...

Arasavilli Temple: ఈ సారి నిరాశే.. భక్తులకు కనిపించని అరుదైన దృశ్యం
Arasavilli
Follow us on

అరుదైన ఘట్టాన్ని వీక్షించేందుకు ఎదురుచూస్తున్న భక్తులకు ఈసారి నిరాశే మిగిలింది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి(Arasavilli) సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకలేదు. ఆకాశం మేఘావృతం కావడంతో ఈ అపురూప దృశ్యం ఆవిష్కృతం కాలేదు. ఏటా ఉత్తరాయనం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో భానుడి కిరణ స్పర్శ సూర్యనారాయుడ్ని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి, శిరస్సు వరకు వెళ్లే ఈ అద్భుత ఘట్టం ఏటా భక్తులను కనువిందు చేస్తోంది. కేవలం 3 నుంచి 4 నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం కనిపిస్తుంది. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు వస్తారు. ప్రతి ఏడాది మార్చి(March) నెల 9, 10, అక్టోబరు(October) 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు మూలవిరాట్టును తాకుతాయి. రేపు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.

ప్రత్యక్ష భగవానుడు సూర్యుడిని దర్శించుకోవడం వల్ల పాపసంహారం కలుగుతుందని భక్తుల నమ్మకం. సూర్య కిరణాలు స్వామి వారి మూలవిరాట్ ను తాకి నిజరూప దర్శనంలో అందరికీ దర్శనమిస్తాయి. అందుకే ఆదిత్యుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. సమస్త జీవకోటి ఆరోగ్యం సూర్యుని ఆధీనంలోనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం ఆదిత్యుణ్ని ఆరాధించే వారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అని భక్తులు నమ్ముతారు. అరసవల్లిలో కొలువైన సూర్యనారాయణస్వామి వారిని ద్వాపర యుగాంతంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించారు. ఈ ఆలయ అభివృద్ధికి క్రీస్తు శకం 682లో దేవేంద్ర వర్మ అనే రాజు భూములిచ్చినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

అరసవల్లిలో ఏడు అశ్వాలతో కూడిన రథంపై దేదీప్యమానంగా స్వామి మూలవిరాట్టు మనకు దర్శనమిస్తోంది. అరుణశిలతో చేసిన ఉత్సవ విగ్రహం భక్తలకు కనువిందు చేస్తుంది. సూర్యుడు రాజవంశీయుడు కావడం వల్లే ఆయనకు మీసాలు ఉంటాయని చరిత్ర చెబుతోంది. సూర్యుడు ఉత్తర, దక్షిణాయనంలో మార్పుచెందే సమయాల్లో కిరణాలు స్వామి వారి పాదాలను తాకుతాయి. ఏటా వీటిని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ప్రధానాలయ నిర్మాణం భక్తులను రెప్పవాలనీయకుండా చేస్తుంది. ఆలయం మొత్తం ఓ భారీ రథాన్ని పోలి ఉండేలా కనిపిస్తుంది. దీనికి రెండువైపులా నాలుగు చక్రాలుంటాయి. ఆలయం ఎదురుగా ఇంద్ర పుష్కరిణి ఉంటుంది.

Also Read

Telangana Jobs: 80వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన.. జోన్లు, మల్టీ జోన్లు, శాఖలవారీగా ఖాళీల వివరాలు ఇవే..

Chanakya Niti: ఈ ఐదుగురి వ్యక్తులతో శత్రుత్వం చాలా ప్రమాదం అంటున్న చాణక్య

Lemon Leaves: నిమ్మ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..నులిపురుగుల నుంచి ఉపశమనం కోసం..ఇలా తీసుకోండి