Statue of Equality 6tht day: హైదరాబాద్(Hyderabad) మహానగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్(Muchintal) శ్రీరామనగరం…దివ్యసాకేతంలో ఆధ్యాత్మిక పరిమళం ఉట్టిపడుతోంది. జై శ్రీమన్నారాయణ..! నినాదాలు మార్మోగాయి. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో అలరారుతోంది. యాగశాల నుండి వందలాది మంది రుత్వికులు వెంటరాగా…శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి(Chinn Jiyar Swamy) సమతామూర్తి వద్దకు ర్యాలీగా బయల్దేరారు. వేద మంత్రోచ్ఛరణాల మధ్య…పవిత్ర గంగాజాలన్ని చల్లుతూ ముందుకుసాగారు. సమైక్యతను చాటే సమతామూర్తి ప్రాంగణానికి చేరారు. అక్కడ ప్రతిష్టించిన దివ్యదేశాలకు ప్రాణ ప్రతిష్ట చేశారు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి.
ఇవాళ అంటే సోమవారం రోజున మొత్తం 33 దివ్యదేశాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. మొదట శ్రీరామానుజాచార్యుల వారికి ఇష్టమైన శ్రీరంగం దివ్యదేశానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి. మొదట 1 నుండి 6 దివ్యదేశాలు…ఆ తర్వాత 8,10,14,15,19,21,22,23,30 క్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అనంతరం రుత్వికులు వేదమంత్రాలు పఠిస్తుండగా…41,42,44,46,49,58,63,66,72,75 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇక మిగిలిన 80,86,88,90,91,98,107,108 దివ్యక్షేత్రాలకు త్రిదండి చినజీయర్‌స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారు. సంఖ్య ప్రాముఖ్యతతోపాటు నక్షత్రం, రాశులను బట్టి ఆయా దివ్యతిరుపతులకుప్రాణ ప్రతిష్ఠ చేశారు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి.
యాగశాలలో దివ్యదేశ దేవతామూర్తులను ఆవాహన చేసిన ప్రధాన కళాశాలలోని మంత్ర జలంతో ప్రతిష్ఠమూర్తులను ప్రోక్షణ చేశారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత కలశోదకంతో ఆలయశిఖరాలపై ఉన్న కళాశాలకు మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని శ్రీ చినజీయర్‌స్వామి వారు సమంత్రకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల చినజీయర్‌స్వామి వారు కూడా పాల్గొన్నారు. ఆరో రోజు దివ్యసాకేతానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దివ్యక్షేత్రల ప్రాణప్రతిష్ఠ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఉత్సవాల్లో భాగంగా దృష్టి దోష నివారణకు వైయ్యూమికేష్టి యాగం నిర్వహించారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళీ పూజ చేశారు. మరోవైపు ఇవాళ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీరామనగరాన్ని సందర్శించనున్నారు. శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి మంగళాసీస్సులు తీసుకోనున్నారు.