AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sriramanavami: శ్రీరామనవమి రోజున ప్రతి ఇంట్లో చుక్క, ముక్క ఉండాల్సిందే..! అందరూ విందు భోజనాలతో ధావత్!

సాధారణంగా శ్రీరామనవమి అనగానే ఠక్కున గుర్తొచ్చేది.. రాములోరి కళ్యాణం. దేశమంతటా శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో వేడుకలను వైభోవంగా జరుపుకుంటారు. నవమి రోజున బెల్లం పానకం, పాయసం, పులిహోర వంటకాలను ఆస్వాదిస్తారు. మద్యం, నాన్ వెజ్ జోలికైతే అసలే వెళ్లారు. కానీ ఇక్కడ అందుకు బిన్నంగా శ్రీరామ నవమి వేడుకలను వెరైటీగా జరుపుకుంటారు.

Sriramanavami: శ్రీరామనవమి రోజున ప్రతి ఇంట్లో చుక్క, ముక్క ఉండాల్సిందే..! అందరూ విందు భోజనాలతో ధావత్!
Sriram Navami
M Revan Reddy
| Edited By: |

Updated on: Apr 17, 2024 | 2:31 PM

Share

సాధారణంగా శ్రీరామనవమి అనగానే ఠక్కున గుర్తొచ్చేది.. రాములోరి కళ్యాణం. దేశమంతటా శ్రీరామనవమిని భక్తిశ్రద్ధలతో వేడుకలను వైభోవంగా జరుపుకుంటారు. నవమి రోజున బెల్లం పానకం, పాయసం, పులిహోర వంటకాలను ఆస్వాదిస్తారు. మద్యం, నాన్ వెజ్ జోలికైతే అసలే వెళ్లారు. కానీ ఇక్కడ అందుకు బిన్నంగా శ్రీరామ నవమి వేడుకలను వెరైటీగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి రోజున ప్రతి ఇంట్లో చుక్క, ముక్క ఉండాల్సిందే. అందరూ విందు భోజనాలతో ధావత్ చేసుకోవాల్సిందే.సంప్రదాయానికి భిన్నంగా వెరైటీగా శ్రీరామ నవమిని జరుపుకుంటున్న ఆ గ్రామామేదో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..!

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీరామనవమి రోజున జరుపుకునే సీతారాముల కళ్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వేడుకలు ఇక్కడి గ్రామస్తులు వెరైటీగా జరుపుకుంటారు. ఇక్కడి గ్రామస్తులంతా రామ భక్తులే. గ్రామంలో శ్రీరామనవమిని మాంసాహార వంటకాలు, విందు భోజనాలతో వేడుకలు వైభవంగా జరుపుకుంటారు. స్థానిక రామాలయంలో ఏకంగా ఐదురోజుల పాటు సీతారాముల పెండ్లి, ఉత్సవాలు జరుగుతాయి. ఆలయంలో రాములవారి కళ్యాణం జరుగుతుండగా, గ్రామస్తులు మాత్రం ఎవరి ఇళ్లలో వాళ్లు యాటలు, కోళ్లు కోసుకుని మందుతో విందు భోజనాలు చేస్తారు.

కోదండ రాముని కళ్యాణం.. ఊరంతా విందు భోజనం

మామూలుగా పెళ్లిళ్ల అనంతరం విందులు వినోదాలు జరుపుకున్నట్లు.. శ్రీరామనవమి రోజు దేవుని కళ్యాణ అనంతరం గ్రామంలో నాన్ వెజ్ తో విందు భోజనాలు చేయడం గ్రామ ఆనవాయితీగా మారింది. నవమి రోజున పూజల తర్వాత మధ్యాహ్నం ఒంటిగంట వరకు సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. అప్పటి వరకు భక్తితో సీతారాముల పెండ్లి వేడుకలు చూసి గ్రామస్తులు తరించిపోతారు. ఆ తర్వాత ఆర్థిక స్థోమతను బట్టి ఇంట్లో మేకలు, కోళ్లు కోసుకుని నవమి వేడుకలు చేసుకుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నాన్ వెజ్ ఆచారం.. వందల ఏళ్లుగా కొనసాగుతోంది.

గరుడ ముద్దల కోసం…

గ్రామంలో ఐదు రోజులపాటు సీతారాముల ఉత్సవాలు శ్రీరామనవమి వేడుకలు కొనసాగుతాయి. నవమికి రెండు రోజుల ముందు మొదలై తర్వాత రెండు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. శ్రీరామనవమిన కల్యాణం రోజున గరుడ ముద్ద (అన్నం ముద్దలు) ఎగరవేయడం ఇక్కడి ఆనవాయితీ. అలా ఎగరేసిన ముద్దలు కోసం గ్రామస్తులు ఎగబడతారు. గరుడ ముద్దులను అందుకొని తిన్నవాళ్లకు శుభాలు కలుగుతాయని గ్రామస్తుల నమ్మకం.

వందల ఏళ్ల క్రితం సంతానం లేని ఇద్దరు బ్రాహ్మణులు దేశ పర్యటన చేస్తూ ఇక్కడికి వచ్చి సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఆలయం ముందు రెండు రాతి స్తంభాలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారికి అది సాధ్యం కాలేదు. రాత్రి స్వామి వారు బ్రాహ్మణుల కలలోకి వచ్చి సూచించినట్లుగా తడి బట్టలతో రాతి స్తంభాలను నిలబెట్టారు. ఆ తర్వాత సీతారాముల కళ్యాణం జరిపారట. కల్యాణం ముందు రోజు గరుడ ముద్ద ప్రసాదంగా స్వీకరించడంతో ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగిందని ప్రచారంలో ఉంది. సీతారామచంద్రస్వామి ఆలయం ఉండడం వల్లే ఈ గ్రామానికి సీతారాంపురం అనే పేరు వచ్చింది. ఆలయంలో మండపం సహా మూడు గర్భగుడులు ఉన్నాయి. సీతారామ,లక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు సంతాన గోపాలస్వామి, ఆండాలమ్మ, గోదాదేవి, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. పిల్లలు లేనివాళ్లు తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి సంతాన గోపాలస్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడి గ్రామస్తుల విశ్వాసం.

అనాదిగా వస్తున్న సంప్రదాయం..

కొన్నేళ్ల క్రితం గ్రామంలో దొరలు, కరణాలు, భూస్వాములు ఉండేవారు. అప్పట్లో గ్రామ పెద్దలుగా ఉన్న వీరు శ్రీరామనవమి రోజున స్వామి వారి కళ్యాణం వాళ్లే జరిపించేవాళ్లు. కళ్యాణాన్ని చూసేందుకు భూస్వాములు, పెత్తందారులు కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చేవారు. రాముల వారి పెండ్లిని కూడా ఇంట్లో పెండ్లిగానే భావించి యాటలు, కోళ్లు కోసి వండి పెట్టేవాళ్లు. అదే వెరైటీ కల్చర్ గ్రామంలో నేటికీ కొనసాగుతోంది. ఆలయంలో రాములవారి కళ్యాణం జరుగుతుండగా, గ్రామస్తులు మాత్రం ఎవరి ఇళ్లలో వాళ్లు యాటలు, కోళ్లు కోసుకొని మందుతో విందు భోజనాలు చేస్తున్నారు.

సాధారణంగా శ్రీరామ నవమి నాటికి ప్రకృతిలో వడగండ్ల వానలు వచ్చి రైతులు అధికంగా పంటలు నష్టపోయేవారు. కాని ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్కరోజు కూడ వడగండ్ల వాన గ్రామ పరిసర ప్రాంతంలో పడలేదని అంతా దేవుని దయగా గ్రామస్తులు భావిస్తున్నారు. మరోవైపు రాములోరి కళ్యాణం రోజున గ్రామంలో ఈ ఆనవాయితికి స్వస్తి పలికేందుకు గ్రామ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…