అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో..దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో హైదారాబాద్ మహానగరం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. వేడుకకు త్రిదండి చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.
రాముడు కేవలం భారతదేశానికే కాదు..ప్రపంచానికే రాజుని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. సుమారు 5 వందల ఏళ్ల తర్వాత రాముడు తన జన్మస్థలానికి చేరుకుంటున్న క్షణం.. దేశ చరిత్రలోనే అద్భుతమన్నారు. దేశం మొత్తం రామనామస్మరణ మార్మోగుతున్న వేళ.. రాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నాడన్నారు చినజీయర్ స్వామి. అయోధ్య లో రాముడు ప్రతిష్ఠ సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించి తన భక్తిని చాటుకోవడమే కాకుండా ఎంతోమంది సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన కొమురయ్య దంపతులను చినజీయర్ స్వామి అభినందించారు. ఇక అలాగే జనవరి 20 నుండి మార్చి 11 వరకు ముచ్చింతల సమతామూర్తి రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీతారాముల కల్యాణం నిర్వహించడం ద్వారా తమ జన్మ చరితార్ధమైందన్నారు డీపీఎస్ చైర్మన్ కొమురయ్య. ఈ సందర్భంగా 5 లక్షల ఇళ్లకు శ్రీరాముడి చిత్ర పటాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…