ఈ ఏడాది ఏప్రిల్ 8న ఖగోళంలో అద్భుతం జరగనుంది. సంపూర్ణ సూర్యగ్రహణం అనే ఒక అరుదైన ఖగోళ దృగ్విషయం ఆవిష్కృతం కానుంది. ఈ రకమైన సంఘటనలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించినప్పుడు ఆకాశం కొంత సమయం పాటు చీకటిగా మారుతుంది. సూర్యగ్రహణం భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం.. భూమి.. సూర్యుని మధ్య వచ్చిన చంద్రుడు వృత్తాకారం సూర్యుడిని పూర్తిగా కప్పేస్తే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. దీని కారణంగా సూర్యుని కిరణాలు భూమిని చేరుకోలేవు.
ఈ సూర్యగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. గత 50 ఏళ్లలో ఇదే సుదీర్ఘ సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8న తేదీ అమావాస్య తిధి రాత్రి 9.12 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై తెల్లవారు జామున 1.25 గంటలకు ముగియనుంది. అంటే ఈ గ్రహణం మొత్తం సమయం 4 గంటల 39 నిమిషాల పాటు ఉండనుంది. దీంతో ఏప్రిల్ 8న సంభవించే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు సంపూర్ణ సూర్యగ్రహణ అద్భుతమైన దృశ్యం 50 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు ప్రజలు ఈ సంవత్సరం మళ్లీ చూడగలరని అంటున్నారు.
ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 సోమవారం 2024న ఏర్పడనుంది. అయితే ఈ అరుదైన దృగ్విషయం భారత దేశంలో కనిపించదు. కెనడా, మెక్సికో, ఉత్తర అమెరికా, యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, నైరుతి యూరప్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణానికి ముందు రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు. కనుక ఈ రోజున ఆకాశంలో చంద్రుడు కొంచెం పెద్దదిగా కనిపిస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు