Hindu Mythology: హిందూ సంప్రదాయంలో పుట్టిన బిడ్డకు తలనీలాలు( Donating Hair) ఇవ్వడం ఒక ఆచారం. ఆడ, మగ అనే తేడా లేదు.. ఎవరైనా సరే.. తమ ఇంట ఇలవేల్పుకో, లేక తమకు సమీపంలో ఉన్న పుణ్య క్షేత్రానికో వెళ్లి దేవుడికి తలనీలాలు సమర్పిస్తారు. ఇక కలియుగ దైవం వెంకన్న కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి (Tirumala Tirupati) లో అయితే.. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తమ మొక్కులను తీర్చుకుంటూ.. తలనీలాలు కూడా అత్యంత భక్తిశ్రద్దలతో దేవుడికి సమర్పిస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పుట్టువెంట్రుకలు తియ్యడం.. దేవుడికి జుట్టు మొక్కు ఇవ్వడం ఒక్క హిందూ సంప్రదాయంలోనే ఉంది. అయితే అసలు దేవుడికి ఎందుకు తలనీలాలు ఎందుకివ్వాలి? దీని ఫలితం ఏంటీ? అనే సందేహం చాలామందిలో ఉండి ఉంటుంది. అయితే ఇలా తలనీలాలు ఇవ్వడం వెనుక కారణాన్ని పురాణాలు పేర్కొన్నాయి. మానవ శిరోజాలు మనిషి అహంకారానికి, పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వీటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటామని.. అందం శాశ్వతం కాదనే నిజాన్ని తెలియజేస్తుందని అంటారు. గర్భంలో వున్న శిశువు భూమి మీదకు మొదటగా తన తల ద్వారా వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగివున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అంటారు. భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఇంకా చెప్పాలంటే.. ఒక రకంగా భగవంతుడికి మన శిరస్సును అర్పించే బదులు కేశాలను సమర్పిస్తున్నాం..
తల వెంట్రుకలను దేవుడికి సమర్పించడం వెనుక మహాభారతంలో ఒక సంఘటన వుంది. జయద్రధుడు (సైంధవుడు)ని సంహరించేందుకు భీముడు రెడీ అవుతాడు. అప్పుడు భీముడిని ధర్మరాజు వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. మనకు సోదరి దుశ్శల.. కనుక సోదరి భర్తను వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని ధర్మరాజు వివరిస్తాడు. అప్పుడు భీముడు యుద్ధంలో సైంధవుడిని ఓడించి గుండు గీస్తారు.
ఇక తిరుమల క్షేత్రంలోనే కాదు.. అన్నవరం, సింహాచలం ఇలా ఏ పుణ్యక్షేత్రంలోనైనా సరే.. తలనీలాలు సమర్పించే ప్రాంతాన్ని ‘కల్యాణకట్ట’ అంటారు. సనాతన హిందూ సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది.
ఇక వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వేంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే శ్రీవారి సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది. స్థాయి బేధం లేకుండా అందరూ స్వామివారికి ఎంతో భక్తిశ్రద్దలతో తమ కేశాలను సమర్పిస్తారు.
Pawan Kalyan: ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పరిహారం ఇవ్వడమేంటి..?.. ప్రభుత్వంపై జనసేనాని ఫైర్