
సనాతన ధర్మంలో మహా శివుడికి ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులలో ఒకరైన శంకరుడు భక్తుల కోరికలు తీర్చడంలో ఎప్పుడూ ముందుంటారు. తన భక్తుల విషయంలో బోళాగా ఉంటాడు కాబట్టి.. ఆయనను బోళా శంకరుడు అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం వారంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి అంకితం చేయబడింది. సోమవారం మహా శివుడికి అంకితం చేయబడింది. ఈరోజున శివుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటంతోపాటు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. భక్తులు శివలింగానికి అభిషేకం చేసి, ఆశీస్సులు పొందాలని ప్రార్థిస్తారు.
శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శివలింగాన్ని పూజించడం అని పండితులు చెబుతుంటారు. అందుకే శివలింగాన్ని పూజించడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని, కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతారు. అయితే, చాలా మంది శివ లింగాన్ని పూజించేటప్పుడు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని కారణంగా వారి పూజ ఆశించిన ఫలితాలను పొందకపోవచ్చు. అందుకే, ఎలాంటి తప్పులు జరగకుండా సోమవారాల్లో శివ లింగాన్ని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శివ లింగాన్ని త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి లింగంపై కుంకుమ సమర్పించవద్దు.
శివ లింగంపై ఎప్పుడూ పసుపు లేదా కుంకుమను ఉంచవద్దు. పసుపు అందం, అదృష్టంతో ముడిపడి ఉంటుంది. దీనిని పార్వతీ దేవి పూజలోనే ఉపయోగిస్తారు.
పొరపాటున కూడా శివలింగంపై తులసిని ఎప్పుడూ ఉంచవద్దు. శివునికి నైవేద్యాలు లేదా పూజలలో తులసిని ఉపయోగించడం నిషిద్ధంగా పరిగణిస్తారు.
శివ లింగంపై విరిగిన బియ్యాన్ని ఎప్పుడూ సమర్పించవద్దు. విరిగిన బియ్యాన్ని అసంపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు.
శివలింగానికి ఎప్పుడూ శంఖపు నీటిని సమర్పించవద్దు.
సోమవారం తెల్లవారుజామున లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. ముందుగా ఆలయంలోని శివ లింగానికి జల అర్చన చేయండి. తర్వాత పంచామృతంతో అభిషేకం చేయండి. అనంతరం స్వచ్ఛమైన నీటితో అభిషేకం పునరావృతం చేయండి. ఆ తర్వాత గంధం పేస్ట్ సమర్పించండి. పూజ సమయంలో ఓం నమ:శివాయ అనే మంత్రాన్ని జపించడం మర్చిపోవద్దు. చివరగా శివుడికి హారతి (పవిత్ర కర్మ) చేయాలి.
ఒక ఇంట్లో ఎన్ని శివలింగాలు ఉంచాలో తరచూ ప్రజలు ఆలోచిస్తారు. వాస్తు ప్రకారం.. ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉంచకూడదు. ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండటం వల్ల ఇంటి శక్తి సమతుల్యత దెబ్బ తింటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి జ్యోతిష్కులు ఇంట్లో ఒక శివలింగాన్ని మాత్రమే ఉంచాలని స్పష్టం చేశారు.
మురికి చేతులతో శివ లింగాన్ని తాకకూడదు. అభిషేకం చేసే సమయంలో వెండి, ఇత్తడి, మట్టి పాత్రలను ఉపయోగించడం మంచిది. అభిషేక సమయంలో శివుడికి అంకితం చేయబడిన మంత్రాలను జపించాలి. పూజ సమయంలో నల్లని దుస్తులు ధరించకూడదు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.