తెలుగు నెలల్లో నాలుగో మాసం ఆషాడ మాసం.. ఈ నెలలో పూజలు, అమ్మవారి జాతరలు, ఉత్సవాలు జరుగుతాయి. జగజ్జనని తన శరీర భాగాలను గింజలు, కూరగాయలు, పండ్లు, గడ్డి ఇలా రకరకాల శాఖలకు జీవాన్ని ఇచ్చి ప్రజల ఆకలి తీర్చింది ఆషాడం సమయంలోనే.. అమ్మవారు శాకంబరీదేవిగా ఆవిర్భవించిన ఈ నెలలో దేవీ ఆలయాల్లో కొలువైన అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరిస్తారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈరోజు నుంచి మూడో తారీకు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి ఆలయాన్ని వివిధ ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో అందంగా అలంకరించారు.
శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు విఘ్నేశ్వర పూజతో ఉత్సవాలను ప్రారంభించారు. రుత్విక్ వరుణ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, వాస్తు హోమం, కలశ స్థాపన పూజలను అర్చకులు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు శాంకబరీ దేవిగా భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నది. అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. క్యూలైన్లు భక్తుల రద్దీతో నిండిపోయాయి.
ఆషాడంలో అమ్మవారిని శాకంబరీగా అలంకరించి పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలిగిపోయి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భక్తుల విశ్వాసం. శాకం అంటే కూరగాయలు. వివిధ కూరగాయలతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు కనుక ఈ సమయంలో అమ్మవారిని శాకంబరీ దేవి అని పిలుస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..