
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్-కర్నాటక సరిహద్దుల్లోని ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో 100 రోజుల వేడుకకు సర్వం సిద్ధమయ్యింది. ఈ దశాబ్దంలోనే కని వినీ ఎరుగని రీతిలో 100 దేశాలను ఒక్క వేదికపైకి తీసుకొస్తూ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది శ్రీ మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్. ఇందులో భాగంగా ఆగస్టు 16 నుంచి నవంబర్ 23 వరకు 100 రోజులపాటు, 100 దేశాలను ఏకం చేయనుంది ఈ మహోత్సవం. కళలు, సంగీతం, ఆధ్యాత్మికత, సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తీసుకురాగలమన్న సత్యాన్ని ప్రపంచానికి చాటనుంది.
ఒక్కో రోజు ఒక్కో దేశానికి చెందిన కళాకారులు తమ కళలను, సంస్కృతిని సత్యసాయి గ్రామం వేదికగా ప్రదర్శించనున్నారు. ఆయా దేశాల ఆధ్యాత్మిక, సాంస్కతిక మూలాలను పరిచయం చేస్తూ ప్రముఖ వక్తలు ప్రసంగించనున్నారు. అనంతరం వన్ వరల్డ్.. వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి ప్రసంగిస్తారు. అనంతరం.. ఆ దేశంలో అత్యుత్తమ సేవలందిస్తున్న ప్రముఖునికి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును అందించనున్నారు.
సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా రోజుల కార్యక్రమంలో భాగంగా శరన్నవరాత్రులలో అతిరుద్ర మహా యజ్ఞాన్ని, అలాగే దుర్గాపూజ తదితర ఆధ్యాత్మిక వేడుకలు కూడా జరగనున్నాయి. అంతే కాదు.. నవంబర్ నెలలో 600 పడకలతో కూడిన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేటు ఉచిత ఆస్పత్రి ప్రారంభం కానుంది. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ అన్నదే ఉండదు. జాతి, మత, కుల, వర్గ, పేద, ధనిక అన్న తేడా లేకుండా ఎవ్వరైనా వచ్చి ఉచితంగా చికిత్స పొందొచ్చు.
నవంబర్ నెలలో ప్రారంభంకానున్న 600 పడకలతో కూడిన ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేటు ఉచిత ఆస్పత్రి
40 దేశాలకు చెందిన 400 మంది మ్యూజీషియన్స్‌తో ప్రపంచ ప్రఖ్యాత సాయి సింఫనీ వరల్డ్ ఆర్కెస్ట్రా ప్రదర్శన కూడా జరగనుంది. 400 మంది కళాకారుల్లో 170 మంది సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌కి చెందిన విద్యార్థులు కావడం విశేషం.
నవంబర్ నెలలో ప్రపంచ మతాల శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రపంచంలో అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మిక నాయకులు ఒకే వేదికపైకి వచ్చి తమ తమ ఆలోచనలను పంచుకోనున్నారు. అనంతరం నవంబర్ 23వ తేదీన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.