Saleshwaram Festival: చుట్టూ అడవి.. కొండలు కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే నల్లమల్ల అటవీ ప్రాంతం.. ఆ ప్రాంతంలో లోయలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతం.. అలాంటి సలేశ్వరం జాతర మొదలు కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పరమేశ్వరుని మహా దర్శన భాగ్యం.. ఉగాది పర్వదినం దాటిన తర్వాత దక్కనుంది. కరోనా ప్రభావంతో రెండేళ్ల తర్వాత ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది సలేశ్వరం యాత్ర.
శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు.. కానీ ఆ పక్కనే ఉన్న అద్భుతమైన సలేశ్వరం చూసారా? సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ రాళ్లు.. రప్పలు.. లోయలలో దిగి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళడానికి వాహన సౌకర్యం ఉండదు. ఎందుకంటే అది దట్టమైన నల్లమల్ల అడవి.. ఈ సల్లేశ్వరం శ్రీశైలంలోని ఒక యత్రా స్థలం. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవుల్లోని ఒక ఆదిమవాసి యాత్రస్థలం. ప్రతి సంవత్సరం ఈ జాతర జరుగుతుంది. జాతర ఉగాది వెళ్ళిన తరువాత తొలిపౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 60 కిలోమిటర్ల దూరంలో వుంటుంది. అడవిలో నుండి 35 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. ఇందులో 30 కిలోమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలోవున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్దులవుతారు.
సలేశ్వరం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంది. శ్రీశైలం – హైదరాబాద్ రహదారిలో శ్రీశైలం అటవీ ప్రాంతంలో వెళ్లాల్సి ఉంటుంది. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ఆటవీ శాఖ అనుమతితో పది కిలోమీటర్ల దూరం వెళ్లగానే రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది. సలేశ్వరం జాతర సంవత్సరాని ఒకసారి, చైత్ర పౌర్ణమికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతుంది. కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కల్పిస్తారు. భక్తులు వచ్చేటప్పుడు “వత్తన్నం.. వత్తన్నం లింగమయ్యో” అంటు వస్తారు. వెళ్లేటప్పుడు “పోతున్నం.. పోతున్నం లింగమయ్యొ” అని భజన చేస్తూ నడుస్తుంటారు. సలేశ్వరం లోయ.. సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ క్యానన్ అందాలను చాలమంది మెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు వున్నాయి. అవి జంతువులు నీటి కోసం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశోధకులకు చాల బాగ నచ్చే ప్రదేశం ఇది.
ఈ నెల 15, 16,17 తేదీల్లో సలేశ్వరం యాత్ర నిర్వహించనున్నారు. రెండు సంవత్సరాల తర్వాత ఈ యాత్ర ప్రారంభమవుతోంది. ఈ యాత్రకు మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ నలు మూలల నుంచి లక్షలాది మంది భక్తులు లింగమయ్య దర్శనానికి తరలి రానున్నారు. జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు, నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేశారు. కనీసం ఐదు రోజులైనా ఉత్సవాలు జరుపుకునేందుకు అధికారులు అనుమతివ్వాలని స్థానికులు కోరుతున్నారు.
Also read:
Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!
Viral Video: గుడ్లను కాపాడేందుకు తల్లి పక్షి అద్భుత పోరాటం.. గుండెలు పిండేస్తున్న షాకింగ్ వీడియో..!
Viral Video: ఇది కదా రాజసం అంటే.. ఈ పిల్లి వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!