శబరిమల.. ఈ పేరు వినగానే అక్టోబర్, నవంబర్ నెల గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అయ్యప్ప స్వామి మాలాధారణలు ఇప్పటి నుంచే ప్రారంభం అవుతాయి. అయ్యప్ప స్వామిని లక్షలాది మంది తమ ఇష్టమైన దైవంగా కొలుస్తుంటారు. ఎంతో మంది దేవుళ్లు ఉన్నా..అయ్యప్పస్వామికి ఓ ప్రత్యేకత ఉంది. అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేయడం, 41 రోజుల పాటు దీక్ష చేపడ్డటం, ఉత్సవాలు నిర్వహించడం అన్నీ ప్రత్యేకమే. అయితే 200 ఏళ్ల క్రితం అంటే 1819లో శబరిగిరులకు మొదటగా 70 మంది భక్తులు యాత్ర చేశారని పురాణాలు చెబుతున్నాయి. అప్పట్లో శబరిమల ఆదాయం 7 రూపాయలుగా పందాలరాజ వంశీయుల రికార్డు నమోదై ఉంది. శబరిమల ఆలయం కేరళ రాష్ట్రంలోని పట్టనంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సయ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఉంది. సముద్రమట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది.
శబరిమలకు చేరేందుకు పంబానది నుంచి కాలినడక మార్గం తప్ప ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. తిరుమల కొండలు ఎంత ప్రత్యేకమైనవో, ఇక్కడ అయ్యప్ప కొండలు కూడా అంతే ప్రత్యేకమైనవి. శబరిమలలో ఉండే 18 మెట్లు 1984 వరకు రాతి మెట్లపైనే భక్తులు వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకునేవారు. అప్పట్లో భక్తులు అయ్యప్ప దీక్ష ఎన్నిసార్లు తీసుకుంటే అన్నిమెట్లకు కొబ్బరికాయలు కొంటే ఆచారం ఉండేది. ఈ ఆచారం వల్ల మెట్లపై ఉండే రాళ్లు చెడిపోవడంతో 1985 సంవత్సరం నుంచి పంచలోహంతో కప్పి మెట్లను తయారు చేయించారట. బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి వాటిని ఈ 18 మెట్లకు అమర్చారు. ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ మెట్లపై ఇతరులెవ్వరిని అనుమతించరు. ఈ మెట్లు ఎక్కాలంటే 41 రోజుల పాటు దీక్ష చేపట్టి, నియమ నిష్టలు, కఠిన నిబంధనలు పాటించి ఎక్కాల్సిందే.
అయితే ఈ 18 మెట్లకు ప్రత్యేకత ఉంది. మొదట ఐదు మెట్లు పంచేంద్రియాలకు సంకేతం. ఆ తర్వాత 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అనంతరం 3 మెట్లు సత్వం, తామసం, రాజషానికి సంకేతం. ఈ త్రిగుణాలు బద్ధకాన్ని విడిచిపెట్టాలని సూచిస్తాయి. చివరి రెండు మెట్లు విద్య, అవిద్యకు సంకేతం. విద్య అంటే జ్ఞానం పొందడానికి, అవిద్య అంటే అహంకారాన్ని వదిలిపెట్టడానికి సంకేతం. శబరిమలను దర్శించుకుంటే దోషాలు, కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. దీక్షను చేపట్టిన భక్తులు ఈ మెట్లను ఎక్కిన తర్వాత మొదటగా కనిపించేది ధ్వజస్తంభం. మొన్నటి వరకు పంచలోహాలతో కప్పబడిన రాతి ధ్వజస్తంభంగా కనబడేది.
అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ భక్తుడి విరాళంతో సంపూర్ణంగా స్వర్ణ ధ్వజస్తంభంగా మారింది. గత ఏడాది ఆలయ తంత్రి కండరరు రాజీవ్ చేతుల మీదుగా ఈ స్వర్ణ ధ్వజస్తంభ ప్రతిస్టాపన జరిగింది. అయితే అయ్యప్ప గర్భాలయం విషయానికొస్తే.. 200 ఏళ్ల క్రితం అయ్యప్పస్వామి గర్బాలయంపైన, ఆలయం చుట్టూ బంగారు రేకులతో కప్పించారు. ఆ బంగారు రేకులపై అయ్యప్పస్వామి జన్మ రహస్యాన్ని చెక్కారు. పిల్లలు లేని పందలరాజు కు బాలుని రూపంలో అడుగులు అగుపించడం, అయ్యప్పస్వామి తన కుమారునిగా పెంచుకోవడం, అయ్యప్పస్వామి తన తల్లి ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవడం కోసం, పులి పాల కోసం వేటకు వెళ్లడం, యోగముద్రలో చివరి సారి ఇక్కడ అయ్యప్ప కొలువుదీరడం లాంటి చరిత్రనంత బంగారు రేకులపై లిఖించబడింది.
మరిన్ని ఆసక్తికర వార్తలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి