Sabarimala Women Entry: శబరిమల స్వామి అయ్యప్ప ఆలయ దర్శనానికి మహిళల ప్రవేశం అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుల కుటుంబానికి చెందిన తజమోన్ మడోమ్‌కు చెందిన సీనియర్ సభ్యుడు, కొండపైకి మహిళల ప్రవేశం కేసును పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణకు లేఖను రాశారు. మాజీ సర్వోన్నత పూజారి కందరారు మహేశ్వరుని భార్య 87 ఏళ్ల దేవకీ అంతార్జనం లేఖ రాశారు. కేసు ఔచిత్యాన్ని పరిగణనలోకి తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని ఆమె సీజేఐని అభ్యర్థించారు.
శబరిమల మహిళల ప్రవేశం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక మైలురాయి అని అంతార్జనం తన లేఖలో పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఈ కేసు కొంచెం పురోగతిని సాధించింది. అయితే ఈ కేసు విచారణ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిందని చెప్పారు. అయ్యప్ప భక్తులకు ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా ప్రముఖులు మద్దతు తెలిపారని దేవకీ గుర్తు చేశారు. ఈ విషయం కేసు ప్రాముఖ్యతను తెలియజేస్తోందని, విచారణను పునఃప్రారంభించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సీజేఐని కోరారు. తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2020 జనవరిలో ఈ కేసులో విచారణ ప్రారంభించినప్పటికీ.. తుది తీర్పు ఇంకా వెలువడలేదు.
సెప్టెంబరు 2018లో 4:1 మెజారిటీ తీర్పుతో.. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోని 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, బాలికలు ప్రవేశించవచ్చని తీర్పునిచ్చింది. శతాబ్దాల నాటి హిందూ మతపరమైన ఆచారాన్ని మారుతున్నా కాలంతో పాటు మార్చాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశంతో జనవరి 2, 2019న పోలీసు రక్షణలో ఉన్న ఆలయంలో మధ్య వయస్సు గల ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలో అడుగు పెట్టారు. దీంతో సాంప్రదాయ వాదులు పోలీసులతో ఘర్షణకు దిగాయి.