
రథసప్తమి రోజున అరసవల్లిలో సూర్యభగవానుడికి చేసే ‘క్షీరాభిషేకం’ చూడటం ఒక విశిష్ట అనుభవం. ఈ ఏడాది సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, ఎక్కడా ఇబ్బందులు కలగకుండా దర్శన స్లాట్లను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన వారు కేటాయించిన సమయానికి ఆలయానికి చేరుకుంటే త్వరగా దర్శనం చేసుకునే వీలుంటుంది. టికెట్ల ధరలు, అధికారిక వెబ్‌సైట్, బుకింగ్ పద్ధతుల గురించి భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈ వివరాలు..
టికెట్ బుకింగ్ విధానం :
భక్తులు తమ దర్శన టికెట్లను అధికారిక దేవదాయ శాఖ వెబ్‌సైట్ www.aptemples.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ‘Devotee Services’ విభాగంలో అరసవల్లి ఆలయాన్ని ఎంచుకోవాలి.
అక్కడ రథసప్తమి ప్రత్యేక దర్శనం లేదా క్షీరాభిషేకం ఆప్షన్‌ను ఎంచుకుని, ఆధార్ కార్డ్ వివరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
టికెట్ బుక్ అయిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కు వచ్చే మెసేజ్ లేదా డౌన్‌లోడ్ చేసిన టికెట్‌ను ఆలయం వద్ద చూపించాల్సి ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ‘Manmitra’ యాప్ ద్వారా కూడా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
సేవల వివరాలు, ధరలు :
రథసప్తమి రోజున స్వామివారికి జరిగే విశిష్ట సేవల్లో క్షీరాభిషేకం ప్రధానమైనది. దీని కోసం ఒక్కో టికెట్ ధరను ప్రభుత్వం రూ. 500 గా నిర్ణయించింది. ఇది కాకుండా రూ. 100 మరియు రూ. 500 ధరలతో ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు తమకు అనుకూలమైన టైమ్ స్లాట్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం, భక్తులు ఆలయ సమీపంలోని ఇంద్ర పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం ఆచారంగా వస్తోంది.
రథసప్తమి ప్రత్యేక షెడ్యూల్ :
జనవరి 25 అర్ధరాత్రి నుండే స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. జనవరి 19 నుండి 25 వరకు వారం రోజుల పాటు అరసవల్లిలో వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా జనవరి 22న మెగా సూర్య నమస్కారాల కార్యక్రమం, జనవరి 24 రాత్రి మ్యూజిక్ కన్సర్ట్ డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడం శ్రేయస్కరం.