అరుదైన అనంత పద్మనాభస్వామి ఆలయం.. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడుందో తెలుసా..?

Ananta Padmanabha Swamy Temple: మన తెలుగు రాష్ట్రంలోనూ ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్న ఈ గుహాలయాలు చతుర్దశ అంతస్తుల నిర్మాణంతో, శిల్పకళతో ఎంతో ప్రత్యేకం. ఈ గుహాలయాల చారిత్రక, శిల్పాత్మక విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం.

అరుదైన అనంత పద్మనాభస్వామి ఆలయం.. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడుందో తెలుసా..?
Ananta Padmanabha Swamy Temple

Updated on: Jan 31, 2026 | 12:41 PM

అనంతపద్మనాభ స్వామి ఆలయం అనగానే.. మనకందరికీ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోని సంపన్న ఆలయమే గుర్తుకు వస్తుంది. కానీ, మన తెలుగు రాష్ట్రంలోనూ అంతటి చరిత్ర కలిగిన ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్న ఈ గుహాలయాలు చతుర్దశ అంతస్తుల నిర్మాణంతో, శిల్పకళతో ఎంతో ప్రత్యేకం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్నాయి. విజయవాడ–ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి మీదుగా అమరావతి రోడ్డులో సుమారు 5 కి.మీ దూరంలో కనిపిస్తాయి. ఈ గుహాలయాల చారిత్రక, శిల్పాత్మక విశేషాలను ఇప్పుడు మనం చూద్దాం…

ఇవి ఎప్పుడు నిర్మించబడ్డవి?

చరిత్ర పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. క్రీ.శ. 420–620 మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినులు కాలంలో ఈ గుహాలయాలు నిర్మాణం జరిగినట్లు భావిస్తున్నారు. విష్ణుకుండినులు మొదట బౌద్ధ ధర్మాన్ని అనుసరించి, తర్వాత హిందూమతాన్ని ప్రోత్సహించిన చరిత్ర ఉంది.

గుహాలయాల నిర్మాణం – అద్భుత శిల్పకళ

ఒకే కొండను నాలుగు అంతస్తుల గుహాలయాలుగా, విహారాలుగా, మందిరాలుగా తీర్చిదిద్దారు. బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులతో విభిన్న శిల్పాలు, విహారాలు… అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. ఈ గుహాలయంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి 20 అడుగుల ఏకశిల విగ్రహం అందరిని ఆకర్షిస్తుంది.

గుహాలయాల నాలుగు అంతస్తుల విశేషాలు

1) మొదటి అంతస్తు.. గుప్తుల, చాళుక్యుల కాలపు శిల్ప నిర్మాణాలు కనిపిస్తాయి. బౌద్ధ సన్యాసుల విహారాలుగా ప్రారంభమయ్యాయని భావిస్తున్నారు. గుహల మధ్య కనెక్టింగ్ మార్గాలు, విస్తృత తిన్నెల నిర్మాణం కనిపిస్తుంది.

2) రెండో అంతస్తు.. మొదట్లో త్రిమూర్తుల మందిరాలుగా ఉండే గదులు ఉండేవని చెప్పబడుతుంది. ఇప్పుడు వాటి అవశేషాలే కనిపిస్తాయి. తాలూకు “తొలగిన తలుపులు” మాత్రమే మిగిలాయి. చీకటిలో అతి సన్నని శిల్పాలు కనిపిస్తాయి.

3) మూడో అంతస్తు.. ఈ అంతస్తు పూర్తిగా వైష్ణవ గుహాలయం.
కొండవీడు రెడ్డి రాజులకు రాజ్యాధికారిగా ఉన్న మాధవరెడ్డి ఈ గుహాలయాన్ని నిర్మించినట్లు శాసనాలు సూచిస్తున్నాయి.

ముఖ్య ఆకర్షణలు..

మహా గణపతి శిల్పం.. గజచర్మం ముడతలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
ఉగ్ర నరసింహుడు.. మూడు ప్రదేశాల్లో కనిపించే నరసింహుడి రూపం, ఇందులో రెండు కుడ్యచిత్రాలుగా ఉండటం విశేషం.
ఆదివరాహస్వామి (లక్ష్మీతో సహా) అరుదుగా కనిపించే శిల్పం.
వామనావతార ఘట్టం, హనుమత్ సందేశ ఘట్టం
సమీప స్తంభాలపై చిత్రంగా కనిపిస్తాయి.

ఉండవల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి..

నల్ల గ్రానైట్ ఏకశిలా విగ్రహం, 20 అడుగుల పరిమాణంలో ఉంటుంది. శ్రీ పద్మనాభుని మందిరంలో ఉన్న అనంత పద్మనాభుని పరిశీలిస్తే.. స్వామితో పాటు పద్మోద్భవుడైన బ్రహ్మ, ఆనందంలో సురేశుని కీర్తిస్తున్న దేవతలు, ధ్యానంలో మునులు, ఆయుధపాణులైన అంగరక్షకులు, అలాగే గగనంలో నర్తిస్తున్న గరుత్మంతుడిని కూడా దర్శించవచ్చు.

ప్రతి రోజు ఉదయం 7:30 నుండి 9:00 వరకు స్వామి దర్శనం ఉంటుంది. ప్రత్యేకంగా శనివారం రోజు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. భక్తులు పసుపుకుంకుమతో స్వామిని పూజిస్తుండటంతో.. నల్ల గ్రానైట్ శిల్పం ఎర్రగా మారి, “ఎర్ర గ్రానైట్” లా కనిపించడం విశేషం.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి?

విజయవాడకు దేశవ్యాప్తంగా బస్సు, రైలు, విమాన సౌకర్యాలు ఉన్నాయి. విజయవాడ నుంచి ఉండవల్లి సెంటర్ వరకు బస్సు చేరుకుని.. అక్కడి నుంచి గుహాలయాలకు సులభంగా వెళ్లవచ్చు. ఉండవల్లి గుహాలయాలు చారిత్రిక, శిల్పాత్మక వైభవంతో నిలిచిన అమూల్య ధన్యం. ఇది ఒక అరుదైన, అపురూపమైన దివ్యానుభూతిని అందించే స్థలం. మీరూ ఒకసారి వెళ్లి ఆ అనుభూతిని పొందండి.