
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి చెప్పిన అనేక విషయాలు ఎంతో ఆసక్తికరంగా, ఆచరణీయంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలు, మనుషుల ప్రవర్తన గురించి కూడా ఆయన చాలా విషయాలు తెలియజేశారు. అర్హతను బట్టి మాత్రమే జ్ఞానము ఇవ్వడం, లేదా లభించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటనను ఇప్పుడు చూద్దాం.
తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయిన విషయాన్ని రమణ మహర్షికి చెప్పటానికి ఒక పెద్ద ఆఫీసర్, అతని భార్య రమణాశ్రమానికి వచ్చారు.
మహర్షి సన్నిధిలో ఆ దంపతులు, మహర్షితో “భగవాన్!.. కొడుకు చనిపోయినప్పటి నుంచి ఆనందానికి దూరమయ్యాము. శాంతి లేదు. గతిలేక ఇలా అటూ ఇటూ తిరుగుతున్నాము. కొడుకంటే మాకు వల్లమాలిన ప్రేమ. మా మమకారం ఎలాంటిదంటే మరు జన్మలోనైనా మా కుమారుని చూస్తామా? అని మా ఆశ. ఇదే మా ఏకైక కోరిక” అని మొరపెట్టుకున్నారు.
ఈ క్రమంలో సన్నిధిలో అందరూ నవ్వారు. ఆ నవ్వు విని ఆ ఆఫీసర్ లేచి నిలబడి ‘ఆశ్రమాలూ, మహాత్ములూ, మర్యాదలూ …. ఇంతవరకు అలాంటి వాటితో మాకు పరిచయం లేదు. మేము ఏమైనా తప్పు మాట్లాడామో మాకు తెలియదు; క్షమించండి!’ అన్నారు.
అంతవరకు సోఫాలో వెనక్కి ఆనుకుని కూర్చొన్న మహర్షి ఈ మాటలు విని లేచి కూర్చుని ‘తండ్రి, కొడుకు, జన్మ …… వీటికి సరియైన అర్ధం తెలుసుకోండి మొదట. ఆ విషయం తెలుసుకుంటే తరువాత వచ్చే జన్మ సంగతి చూసుకోవచ్చును’ అని సెలవిచ్చారు.
అందుకు ఆఫీసర్ ‘మాకు ఇవన్నీ తెలియవు భగవాన్. మాకు ఇవన్నీ తెలుసుకోవలసిన అవసరమూ లేదు. వైరాగ్యమూ, జ్ఞానమూ అవన్నీ మాకు పట్టవు. మాకు ఇది ఒక్కటి చెప్పండి చాలు. మరు జన్మలో మా కొడుకుని చూస్తామా! లేదా!?’ అని అన్నారు.
ఆ మాట విన్న మహర్షి ఇంకా ముందుకు జరిగి చేతులు పైకెత్తి.. ‘ఆహా! తప్పకుండా చూస్తావు. ఈ జన్మలో నీ కొడుకుని నువ్వు చూసినంత ప్రత్యక్షంగా మరు జన్మలోనూ చూస్తావు’ అని అన్నారు రమణ మహర్షి.
ఆ మాటకి వారు(ఆఫీసర్ దంపతులు) కరిగిపోయి, పొంగిపోయి ‘చాలు భగవాన్! మాకు ఇక ఏమీ వద్దు’ అని మహర్షి పాదాలకి నమస్కారము చేసి వెళ్లిపోయారు.
వారు వెళ్లిన తరువాత ఒక ఆశ్రమ సేవకుడు ‘భగవాన్!.. అలా చెప్పారేమిటి? అది ఎలా జరుగుతుంది? అని అడిగాడు. అందుకు మహర్షి ‘ఏమి చెయ్యను? అలా చెప్పకపోతే వారి విశ్వాసం పునాదులతోసహా కదిలిపోతుంది’ అని సెలవిచ్చారు.
ఆ తర్వాత మహర్షి అక్కడ ఉన్న అందరి భక్తులను కలియచూస్తూ ఇలా సెలవిచ్చారు రమణులు.. ‘భగవద్గీత చెప్పినట్లు “వారివారి అర్హతను బట్టి వారివారికి జ్ఞానము ఇవ్వాలి. సిద్ధం కానివారికి వేదాంతము బోధిస్తే అసలు వారి విశ్వాసమే నాశనం అవుతుంది’.
Note: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది.