Padmanbhaswamy Temple: ఆర్థిక సంక్షోభం కారణంగా కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆలయం చాలా క్లిష్టపరిస్థితులలో ఉందని, విరాళాలు ఖర్చులకు కూడా సరిపోవడంలేదని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. నెలవారీ వ్యయం రూ.1.25 కోట్లు అయితే విరాళాలు కేవలం రూ.60-70 లక్షలు కూడా రావడం లేదని చెబుతున్నారు. పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు సాధించింది. అలాంటిది ఆర్థిక సంక్షోభంలో ఉండటమేంటని అందరు చర్చించుకుంటున్న విషయం.
ఆలయ ఆస్తి ఎంత?
పద్మనాభస్వామి ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా గుర్తింపు సాధించింది. ఆలయంలో ఉన్న మొత్తం నిధి విలువ 1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. దీని అర్థం అనేక చిన్న దేశాల ఆర్థిక వ్యవస్థకు సమానం. ఈ మహా దేవాలయాన్ని 18 వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ రాజ కుటుంబం పునర్నిర్మించినట్లు చెబుతారు. 1947 ఇండియన్ యూనియన్‌లో విలీనానికి ముందు ట్రావెన్ కోర్ రాజ కుటుంబం దక్షిణ కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను పాలించేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దేవాలయం బాధ్యతను ఆ వంశస్థులే నిర్వహించారు.
నిధి విలువ ఎంత?
ఆలయంలో మొత్తం ఆరు బేస్‌మెంట్‌లు ఉన్నాయి వీటిలో ఉన్న ఆస్తి అంచనాపై చాలా చట్టపరమైన వివాదం నెలకొంది. 2017లో సెల్లార్లలో లాక్ చేయబడిన ట్రెజరీని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. గోపాల్ సుబ్రమణ్యం కమిటీ తహఖానా- A ని తెరిచినప్పుడు దానిలో సుమారు 1,00,000 కోట్ల నిధి బయటకు వచ్చిందని చెబుతారు. ఈ నిధిలో రోమన్, మధ్యయుగ, నెపోలియన్, బ్రిటిష్ కాలానికి చెందిన బంగారు నాణేలతో నింపబడిన సంచులు ఉన్నాయి. వాటిలో కొన్ని 8 క్వింటాళ్ల వరకు ఉన్నాయి. ఇది కాకుండా దేవుని విగ్రహాలు, సింహాసనం, 20 కిలోల బంగారు దుస్తులు కూడా కనుగొన్నారు. దీనితో పాటు అనేక బంగారు కళాఖండాలు, వజ్రం, నీలమణి, విలువైన రత్నాలు, విలువైన లోహాలతో చేసిన అనేక ఇతర వస్తువులు వెలుగులోకి వచ్చాయి.