ఎంతకూ తెగించార్రా.. పవిత్రమైన అప్పన్న ప్రసాదంతో ఆటలా.. అసలు నిజం ఇదే..!

సోషల్ మీడియా కొందరి చేతుల్లో "బ్లాక్ మెయిలింగ్" అస్త్రంగా మారుతోంది. ఏదో పేరుతో యూట్యూబ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేయడం.. మర్యాద దక్కలేదనో, డబ్బులు ఇవ్వలేదనో.. వెంటనే కెమెరా తీసి "అవినీతి.. అన్యాయం.." అంటూ అడ్డు అదుపు లేకుండా విషం చిమ్ముతున్నారు. లేనివి ఉన్నట్టు సృష్టించి అందరినీ అందోళనకు గురి చేస్తున్నారు.

ఎంతకూ తెగించార్రా.. పవిత్రమైన అప్పన్న ప్రసాదంతో ఆటలా.. అసలు నిజం ఇదే..!
Simhachalam Temple Prasadam

Updated on: Dec 31, 2025 | 8:30 AM

సోషల్ మీడియా కొందరి చేతుల్లో “బ్లాక్ మెయిలింగ్” అస్త్రంగా మారుతోంది. ఏదో పేరుతో యూట్యూబ్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేయడం.. మర్యాద దక్కలేదనో, డబ్బులు ఇవ్వలేదనో.. వెంటనే కెమెరా తీసి “అవినీతి.. అన్యాయం..” అంటూ అడ్డు అదుపు లేకుండా విషం చిమ్ముతున్నారు. లేనివి ఉన్నట్టు సృష్టించి అందరినీ అందోళనకు గురి చేస్తున్నారు. చివరికి కోట్లాది మంది ఆరాధించే దైవాన్ని, పవిత్రమైన ప్రసాదాన్ని కూడా వివాదాల్లోకి లాగడం భక్తుల మనోభావాలను గాయపరుస్తోంది. మొన్న భద్రాచలం రామయ్య లడ్డూలో పురుగు అంటూ ఓ యూట్యూబర్‌ హడావుడి చేస్తే.. నిన్న సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ మరో యూట్యూబర్‌ అబద్ధాలు ప్రచారం చేశాడు.

దేవాలయాల పవిత్రత, భక్తుల సెంటిమెంట్‌తో యూట్యూబర్స్‌ ఆటలాడుతున్నారు. చేతిలో కెమెరా ఉంది కదా అని కోట్లాది మంది ఆరాధించే దైవాన్ని, కళ్లకు అద్దుకునే ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగుతూ కొందరు యూట్యూబర్లు బరితెగిస్తున్నారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలుపుతూ, భక్తుల మనోభావాలను గాయపరుస్తున్న ఈ వీడియోల వెనుక ఉన్న అసలు కుట్రను సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేశారు ఆలయ అధికారులు.

సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్తను పెట్టి అపవిత్ర అంటగట్టాడు ఓ యూబ్యూబర్‌. ప్రసాదం కౌంటర్ దగ్గర సిబ్బంది తనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న ఏకైక కారణంతో ఆ యూట్యూబర్ కక్ష పెంచుకున్నాడు. తనే బయట నుంచి ఒక నత్తను తెచ్చి, తను కొన్న ప్రసాదంలో పెట్టి.. అప్పన్న ప్రసాదం అపవిత్రమైంది అంటూ వీడియో తీసి అలజడి సృష్టించాడు. వీడియో తీస్తూ.. “చూడండి భక్తులారా, ప్రసాదంలో నత్త” అంటూ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేశాడు.

ఆ వీడియో వైరల్ కాగానే ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అధికారులు రంగంలోకి దిగారు. విచారణలో అసలు విషయం బయటపడేసరికి ఆ యూట్యూబర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అధికారులు గట్టిగా నిలదీసేసరికి.. “అవును, కోపంతో నేనే ఈ వీడియో పెట్టాను.. తప్పు చేశాను.. వీడియో డిలీట్ చేశాను” అంటూ ఒప్పుకున్నాడు. సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ వైరల్ అయిన వీడియో కేవలం దుష్ప్రచారమేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

మరోవైపు భద్రాచలంలో కూడా ఇదే తరహా అరాచకం సాగింది. లడ్డూ ప్రసాదంలో పురుగు వచ్చిందంటూ వీడియో తీసి పెట్టాడు ఓ యూట్యూబర్‌. అయితే ఇది ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలని సృష్టించిన కల్పిత వీడియో అని అధికారులు స్పష్టం చేశారు. ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భద్రాచలం పట్టణ పోలీసులకు ఈవో దామోదర్ రావు ఫిర్యాదు చేశారు.

ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించడం క్షమించరాని నేరం. కేవలం వ్యక్తిగత కోపంతో ఇలాంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. వీడియో డిలీట్ చేశారని వదిలేస్తే రేపు మరో ఆలయంపై, మరో పవిత్రమైన అంశంపై ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..