దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసురమర్ధిని, మహాకాళి, సిద్ధిధాత్రి రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తమతమ సంప్రదాయం ప్రకారం ఆరాధిస్తున్నారు. అమ్మలగన్నయమ్మ అనుగ్రహం కోసం భక్తులు తమదైన శైలిలో భక్తిని చాటుతున్నారు. కేరళ త్రివేండ్రంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో భక్తులు అగ్ని గుండంపై నుంచి నడిచారు. ఇందులో విశేషమేముంది అనుకోకండి.. ఇప్పటివరకు మనం భక్తులు నిప్పులపై నడవడం మాత్రమే చూశాం. కానీ ఇక్కడ కణకణ ఎగసిపడుతున్న అగ్ని కీలల మధ్య నుంచి భక్తులు భక్తి పారవశ్యంతో నడిచి వెళ్తున్నారు. భోగి మంటలా పేర్చిన కట్టెల నుంచి ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతుండగా భక్తులు ఆ మంటల మధ్య నుంచి అమ్మవారిని కీర్తిస్తూ నడిచి వెళ్తున్నారు. ఆ దృశ్యం చూడ్డానికి సీతమ్మవారు అగ్ని స్నానం ఆచరించిన నాటి దృశ్యాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో భక్తులను ఆకట్టుకుంటుంది.
మరోవైపు.. విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మంగళవారం అమ్మవారు మహిషాసుర మర్ధనీ దేవీ గా దర్శనమిస్తోంది. అష్ట భుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుందని భక్తుల నమ్మకం. బుధవారంతో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తులు, భవానీల తాకిడి పెరిగింది.
మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి