మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబక గ్రామంలోని త్రయంబకేశ్వరాలయం హిందువులందరికీ ప్రధాన విశ్వాస కేంద్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం.. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగం ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో శివుడు మహామృత్యుంజయ రూపంలో ప్రతిష్టించబడ్డాడు. అంతేకాదు త్రిమూర్తు లింగాలుగా ప్రతిష్టించిన ఏకైక జ్యోతిర్లింగం ఇదే. ఈ జ్యోతిర్లింగాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తుల గుర్తింపుగా పరిగణిస్తారు. ఈ దేవాలయం హిందువులకు చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయ విశిష్టత ఏమిటో, పౌరాణిక చరిత్ర ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
ఈ దేవాలయం 268 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఈ ఆలయం నాసిక్, బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే మూడు కొండల దిగువన పచ్చని చెట్ల మధ్య ఉంది. ఇది 12 ప్రధాన జ్యోతిర్లింగ ఆలయాలలో ఒకటి. గోదావరి జన్మ స్థానం వద్ద త్రయంబకేశ్వర శివాలయం నిర్మించారు. గోదావరి నది నాసిక్ లో పుట్టి.. ఆ రాష్ట్రము నుంచి ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతం వద్ద కలుస్తుంది.గంగ నది తర్వాత భారతదేశంలోని రెండవ పొడవైన నదిగా గోదావరి నది.
త్రయంబకేశ్వర్ శివాలయంప్రత్యేకత ఏమిటంటే, ఈ జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా మూడు ముఖాలుగా ఉంటుంది. 1756 ఫిబ్రవరిలో మహా శివరాత్రి రోజున ప్రారంభించబడిన పురాతన ఆలయం ఉన్న స్థలంలో ఈ ఆలయాన్ని పీష్వా బాలాజీ బాజీరావ్-III నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం ‘ప్రారంభం’, పశ్చిమ ద్వారం ‘పరిపక్వత’, ఉత్తర ద్వారం ‘ద్యోతకం’, దక్షిణ ద్వారం ‘పూర్తి’ని సూచిస్తాయి.
పురాణాల ప్రకారం గౌతమ మహర్షి, గోదావరి పిలుపుపై శివుడు ఈ ప్రదేశంలో నివసించాడు. ఈ త్రిమూర్తి లింగం బంగారు ముసుగుతో ఉన్న ఆభరణంతో కప్పబడి ఉంటుంది. శ్రావణ మాసంలో ఈ ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా చేరుకుంటారు. కాల సర్ప దోష నివారణకు శివుడిని ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో త్రయంబకేశ్వరుడిని దర్శించుకోవడం చాలా పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున నల్లరాళ్లతో నిర్మించబడింది.
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ పౌరాణిక చరిత్ర చాలా ఆసక్తికరమైనది. ఇక్కడ చాలా మంది ఋషులు కలిసి జీవించారని చెబుతారు. అయితే ఈ ఋషులలో కొందరు గౌతమ మహర్షిని ద్వేషించారు. ప్రతిరోజూ అతనిని కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. ఒకసారి ఋషులు గౌతమ మహర్షిని గోహత్య చేసినట్లు ఆరోపించారు. గోహత్య పాపాన్ని పోగొట్టుకోవడానికి గంగా దేవిని ఇక్కడికి తీసుకుని రావాలని చెప్పారు. అప్పుడు గౌతమ మహర్షి ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించి పూజించడం ప్రారంభించాడు.
గౌతమ మహర్షి తపస్సు ని మెచ్చిన శివుడు సంతోషించి, పార్వతితో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గౌతమ ఋషి గంగను వరముగా పంపమని అడిగాడు.. అయితే దేవత శివుడు ఈ ప్రదేశంలో ఉంటేనే తాను ఇక్కడ ఉంటానని గంగా దేవి చెప్పింది. దీంతో శివుడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంలో అక్కడ నివసిస్తానని అంగీకరించాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు