
కర్ణాటక దావణగిరి జిల్లాలోని నాగేన హళ్లి అనే గ్రామంలో ప్రతి ఇంటిలో గుట్టలు గుట్టలుగా పాములుంటాయి. ఈ గ్రామంలో గ్రామస్తులు, పాములు కలిసి నివసిస్తున్నారు. అసలు ఇక్కడ నివసించే స్థానికులను మాత్రామే కాదు ఆ గ్రామంలో అడుగు పెట్టిన వారి సైతం పాములు ఎటువంటి హానికలిగించవు. ఒకవేళ ఎంత విషపూరితమైన పాము కరిచినా ఆ గ్రామంలో ఉన్నంత వరకూ ఏమీ కాదు. అందుకనే ఈ గ్రామంలో నాగు పాము వంటి విష సర్పాలు సంచరించినా భయపడరు. ఇంకా చెప్పాలంటే ఈ గ్రామానికి ఈ తాచుపాముల వల్లనే నాగేనహళ్లి అనే పేరు వచ్చిందట. నాగేన హళ్లి అంటే తాచుపాముల గ్రామం అని అర్ధం..
సైన్స్ కి సవాల్
ఈ గ్రామంలో ఎవరినైనా పొరపాటున పాము కరిస్తే.. ఈ గ్రామంలో ఉన్నంత వరకూ వారికి ఏమీ కాదు. విషం శరీరంలోకి ఎక్కదు. అయితే ఏ కారణంతోనైనా పాము కాటుకు గురైన వ్యక్తి వెంటనే .. ఊరి పొలిమేర దాటి వెళ్ళితే.. పాము విషయం శరీరం అంతటా వ్యాపించి గ్రామం బయట అడుగు పెట్టిన మరుక్షణం మరణిస్తారు.
అయితే ఆ గ్రామంలో ఉన్నంత వరకూ పాము విషం ఎందుకు పనిచేయదో ఇప్పటి వరకు మిస్టరీనే. ఈ విషయంపై ఇప్పటికే అనేక మంది శాస్త్రజ్ఞులు పరిశోధలు చేసినా కనుగొనలేకపోయారు. ఆ గ్రామంలో ఎవరికైనా పాము కరిస్తే.. కరచిన పాముని తీసుకొని వెళ్ళి ఆ ఊరి స్మశానంలో ఉన్న యతీశ్వర మండపం వద్ద పెడతారు. తర్వాత పాము కరచిన బాధితుడు ఆ గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయంలోకి వెళ్ళి అక్కడ స్వామివారి తీర్ధం తీసుకుంటాడు. ఆ ఆలయంలోనే నిద్ర పోకుండా మర్నాడు ఉదయం వరకూ ఆ గుడిలో జాగరణ చేస్తాడు. ఇలా చేయడం వలన శరీరంలోని విషం నిర్వీర్యం అయి ప్రాణాలతో క్షేమంగా బయటపడతాడు.
ప్రాచుర్యంలో ఉన్న ఓ కథ
ఒకానొక సమయంలో ఈ గ్రామంలో యతీశ్వర స్వామి అనే సాధువు నివసించేవారట. అయన రోజూ ఉదయమే గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి బిక్ష స్వీకరించి అక్కడ ఉన్న హనుమాన్ గుడి పరిసరాల్లో విశ్రాంతి తీసుకొంటూ ఉండేవారట. ఇలా ఒక రోజు బిక్ష తీసుకుని తిరిగి హనుమంతుడి ఆలయానికి వస్తుండగా.. అక్కడ పొదల్లో ఉన్న ఒక చిన్న శిశివుని స్వామి చూశారట. ఆ బిడ్డను స్వామి చేరదీసి తనతో పాటు హనుమంతుడి గుడికి తీసుకుని వెళ్లారట. బిడ్డను పెంచి పెద్ద చేసే క్రమంలో 12 ఏళ్ళు గడిచాయి.. ఆ మగబిడ్డకు 12 ఏళ్ళు నిండాయి. ఎప్పటిలా సాధువు బాలుడిని హనుమంతుడి గుడి దగ్గర విడిచి గ్రామంలోని బిక్ష స్వీకరించేందుకు వెళ్లారట. అయితే గ్రామం నుంచి తిరిగి హనుమాన్ గుడికి వచ్చేసరికి ఆ బాలుడి మరణించి ఉన్నాడు. అకాల మృత్యువుకి కారణం పాము కాటు అని గుర్తించిన స్వామికి పాములపై విపరీతమైన ఆగ్రహం కలిగింది.
పాములకు శాపం ఇచ్చే ప్రయత్నం..
తన పెంపుడు కొడుకు మృత దేహాన్ని చుసిన తపస్సంపన్నమైన ఆ సాధువు తీవ్రమైన ఆగ్రహంతో నాగరాజుని శపించడానికి యత్నించాడు. శాపం విషయాని ముందుగా పసిగట్టిన నాగరాజు లిప్త పాటు పాతాళ లోకం నుంచి తన పరివారంతో సహా సాధువు ముందు ప్రత్యక్షమయ్యాడు. పాతాళలోకం నుంచి సాధువు ముందుకు వచ్చిన నాగ రాజు తమ పరివారాన్ని క్షమించమని వేడుకొన్నాడు. అంతేకాదు ఆ బాలుడికి మళ్ళీ ప్రాణం పోశాడు. తన చిన్నారి బాలుడు బతకడం చూసిన సాధువు శాంతించి.. ఇకపై గ్రామంలో నివశించే వారి మీద లేదా.. గ్రామంలో ఉన్న వారిపై ఎటువంటి పాము దాడి చేయరాదని… ఈ గ్రామంలో ఉన్నంత వరకూ ఏ సర్పం విషం పని చేయడానికి చెప్పాడు. గ్రామం దాటిన తర్వాత మాత్రమే పాము విషం పనిచేయాలని నాగ రాజుకి సాధువు కండిషన్ పెట్టాడు.
సాధువు పెట్టిన షరతుకు నాగరాజు అంగీకారం తెలిపాడు. అనంతరం ఆ గ్రామ సరిహద్దులపై 4 బండ రాళ్ళను పాతి వాటి పై సాధువు స్వయంగా ఈ నాలుగురాళ్ల సరిహద్దులపై ఉండే నాగేనహళ్లి గ్రామంలో ఉన్నంతవరకు విష సర్పం కరచినా ప్రాణహాని జరగదని రాశాడు. అంతేకాదు గ్రామంలో ఉండగా సర్పం కరచిన వారు 48 గంటల లోపు గ్రామం దాటితే మరణం తప్పదని పేర్కొన్నాడు. ఇప్పటికీ యతీశ్వర స్వామి గ్రామ సరిహద్దు వద్ద పాతిన నాలుగు సరిహద్దు బండరాళ్ళు నిలిచి ఉన్నాయి.
ఈ గ్రామంలో నివశించే ప్రజలకు సాధువు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు.. గ్రామస్తులు సర్పాలను చంపరాదు. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా తెలిసీతెలియక ఈ నియమాలను అతిక్రమిస్తే తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవలసి ఉంటుందని సాధువు తెలిపారట. అయితే ఈ యతీశ్వర స్వామి ఏ శతాబ్ధానికి చెందిన వారో నేటికీ ఎవరికీ తెలియదు..
అయితే ఈ సాధువు కథ ఒక తరం నుంచి మరో తరానికి అందుతూనే ఉంది. ఈ గ్రామం లో 100 లోపులోనే ఇల్లు ఉన్నాయి. ఆ గ్రామంలో ఇళ్లలోనూ..తోటల్లోనూ.. పొదల్లోనూ.. తాచుపాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి. అయితే అవి పాములు.. విష జంతువులు.. తమని కరిస్తే ప్రాణాలు పోతాయని ఎ ఒక్క గ్రామస్థుడు ఆలోచించారు. వాటిని సాధరణ జీవుల్లాగే భావించి తమ పని తాము చేసుకొని పోతుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు