సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!

Monday rituals for wealth: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సోమవారం శుభప్రదం. ఇంటి శుభ్రత, అహంకారం లేని మనస్సు, మంగళప్రదంగా ఉండటం ముఖ్యం. శ్రీ వ్రతం, నాగ దమన పూజ వంటివి చేయలేకపోతే, లక్ష్మీ సహస్రనామం లేదా శ్రీయై నమః అంటూ కుంకుమార్చన చేయండి. దానధర్మాలు ఆచరించి దోషాలను తొలగించుకోండి.

సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
Laxmidevi

Updated on: Mar 22, 2026 | 11:44 PM

చైత్ర నవ రాత్రులలోని సోమవారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటి నుండి బయటపడలేకపోతున్నామనే బాధతో ఉన్నవారికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి సోమవారం రోజున చేయదగిన కొన్ని ముఖ్యమైన పూజలు, పాటించాల్సిన నియమాలను గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. కేవలం పూజలు, వ్రతాలతో పాటుగా కొన్ని నియమాలను కూడా పాటించడం అత్యవసరం. ముఖ్యంగా, మన మనసులో అహంకారము ఉండకూడదు. ఇతరులను ఏడిపించడం గానీ, బాధ పెట్టడం గానీ చేయకూడదు. అలాగే, ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అన్నం తిన్న తర్వాత శుద్ధి చేయకపోవడం, ఎంగిలి చేత్తో పాత్రలను ముట్టుకోవడం, వంటివి దారిద్రానికి కారణాలు.

దారిద్య్రానికి కారణాలు

ఇంటి ఇల్లాలు మంగళసూత్రాన్ని మెడలోంచి తీయకుండా, చక్కగా నుదుటిన బొట్టు ధరించి, మంగళప్రదంగా కనిపించాలి. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా, శుభ్రంగా ఉండాలి. ఎక్కడపడితే అక్కడ దుమ్ము, బూజు, ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోకపోవడం, చెప్పులు, చీపురు, చేట పడేయడం, మాసిపోయిన బట్టలు వేయడం లేదా పడేయడం, చిరిగిపోయిన బట్టలు కట్టుకోవడం వంటివి దారిద్య్రానికి హేతువులు. బాహ్య శుద్ధి, అంతరంగ శుద్ధి రెండూ అవశ్యకం.

అహంకారాన్ని వీడాలి..

అహంకారానికి సంబంధించిన ఒక పురాణ గాథ ఇంద్రుడిది. దూర్వాస మహాముని ఇచ్చిన పూలమాలను అహంకారంతో విసిరేయడం వల్ల ఇంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోయాడు. లక్ష్మీదేవి అతనిని విడిచి వెళ్లిపోయింది. మళ్లీ లక్ష్మీదేవిని ప్రార్థించిన తర్వాతే ఆమె అనుగ్రహం పొందగలిగాడు. కాబట్టి, అహంకారాన్ని విడనాడాలి.

వివాహ, సంతాన సమస్యలు తొలగి..

మార్చి 23న సోమవారం నాడు శ్రీ వ్రతము, అలాగే నాగ దమన పూజ చేయడం చాలా మంచిది. సోమవారం నాడు దవనాలతో లక్ష్మీదేవిని పూజించి, నవనాగ స్తోత్రం చదువుతూ, నవనాగులను ప్రతిష్టించుకుని, పసుపు, పాలతో అభిషేకం చేసి దవనాన్ని సమర్పించడం వల్ల రాహు కేతువులకు సంబంధించిన ఇబ్బందులు, సంతానానికి సంబంధించిన సమస్యలు, వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి.

కొంతమందికి షోడశోపచార పూజా విధానం తెలియకపోవచ్చు. అటువంటి వారు లక్ష్మీ సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం చదవవచ్చు. అవి కూడా కుదరకపోతే, కనీసం “శ్రీయై నమః” అని అంటూ అమ్మవారి చిత్రపటానికి కుంకుమార్చన చేయవచ్చు. భగవంతుడు మనల్ని ఎప్పటికీ వదలడు. కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనం శ్రద్ధగా అమ్మవారిని ప్రార్థించాలి. “అమ్మ నువ్వు తప్ప నాకింకెవరూ లేరు, నాకీ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని చూపించమ్మ” అని వేడుకోవాలి.

దోషాలన్నీ పోయి..

నివేదనగా అమ్మవారికి శుచిగా, శుభ్రంగా తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం, దాహంతో ఉన్నవారికి నీటిని అందించడం ద్వారా భగవంతుడు సంతృప్తి పడతాడు. వేసవి కాలంలో నీటి దానం చేస్తే కుజ దోషం పోతుందని అంటారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంలో ద్రవ్య సహాయం చేయవచ్చు, లేదా పక్షుల కోసం మట్టి పిడతల్లో నీళ్లు పోసి మేడ మీద, ఇంటి ముందు పెట్టవచ్చు. ఆవులకు, పశువులకు, బాటసారులకు నీటిని అందించడం వల్ల అనేక దోషాల నుంచి బయటపడవచ్చు.

“ఇన్నాళ్లు చేశాము, ఈరోజు ఇది చేసేస్తే రాత్రికి రాత్రే మన తలరాత మారిపోతుందా” అనే అపనమ్మకాన్ని పక్కన పెట్టి, సోమవారం నాడు కనీసం పది నిమిషాలు లక్ష్మీదేవి ముందు కూర్చుని అమ్మ అనుగ్రహం కోసం ప్రార్థించండి. శుద్ధమైన మనసుతో, శుద్ధంగా కూర్చుని మీ మనసును అమ్మవారికి అర్పించి పూజ చేయండి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us