
Medaram Maha Jatara: జజ్జనకరి జాతరే…తెలంగాణ యాతరే అంటోంది ప్రజానీకం. అప్పుడే లక్షల సంఖ్యలో వనం బాట పట్టారు జనం. సమ్మక్క, సారక్కల దర్శనం కోసం చలో మేడారం అంటున్నారు. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన ఈ మహా యాతరకు ముందస్తుగానే జనం క్యూ కడుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళుతున్నారు. ఫిబ్రవరిలో ఈ జన జాతరకు తెర లేస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరుగుతుంది. అంటే ఇంకా నెలకు పైగా టైమ్ ఉంది. అయితే వరుసగా సెలవులు రాగానే.. జనం మేడారం బాట పడుతున్నారు.
2024 మేడారం మహా జాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు మహాజాతర తేదీలను ఖరారు చేశారు.. కానీ భక్తజనం మాత్రం ముందే లక్షలాదిగా మేడారంకు తరలి వస్తున్నారు. మూడు రోజులు వరుసగా సెలవు దినాలు రావడంతో భక్తులు మేడారం బాట పట్టారు. సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు రెండు లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారు.
2024 మేడారం మహా జాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉంది.. కానీ జనం మాత్రం ముందే పరుగులు పెడుతున్నారు. లక్షలాదిగా తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో పది లక్షల మంది భక్తులు ఆ వన దేవతలకు మొక్కలు చెల్లించుకున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. బుధవారం మంత్రులు కూడా వనదేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. అసలు జాతర తేదీలు ఎప్పుడు..? భక్తులు ఎందుకు ముందే తొందర పడుతున్నారు..?
ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు మేడారం మహా జాతర జరుగనుంది.. 21వ తేదీ బుధవారం నాడు కన్నెపల్లి నుండి సారలమ్మ ను, కొండాయి నుండి గోవిందరాజును, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలను తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన అసలు ఘట్టం మొదలవుతుంది. చిలుకలగుట్ట నుండి కుంకుమభరణి రూపంలో సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. సమ్మక్కను తీసుకువచ్చే సమయంలో జిల్లా SP గాలిలోకి పది రౌండ్లు కాల్పులు జరుపుతారు. అనంతరం జిల్లా కలెక్టర్, మంత్రులు, ప్రభుత్వ అధికార యంత్రాంగం అధికారికంగా సమ్మక్క పూజారులకు స్వాగతం పలుకుతారు.
ఫిబ్రవరి 22వ తేదీ న సమ్మక్కను తీసుకు వచ్చి గద్దెలపై ప్రతిష్టించిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఫిబ్రవరి 23వ శుక్రవారం రోజున సమ్మక్క సారక్క దేవతలు ఇద్దరు గద్దెలపై కొలువై ఉంటారు. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సాధారణ భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.. ఇక ఫిబ్రవరి 24వ తేదీ శనివారం సాయంత్రం సమ్మక్క సారక్క దేవతల వన ప్రవేశం కార్యక్రమం ఉంటుంది. వనప్రవేశం కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. కానీ భక్తులు మాత్రం జాతరకు నెల రోజుల ముందే మేడారంకు ధార పడుతున్నారు. లక్షలాధిగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకొంటున్నారు.
సంక్రాంతి సెలవులు మొదలైన 11 తేదీ నుండి 17వ తేదీ వరకు సుమారు పది లక్షల మంది భక్తులు తరలివచ్చి వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు అంచనాలు వేస్తున్నారు. జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే కారణంతో భక్తులు ముందే వచ్చి సమ్మక్క – సారక్క దేవతలకు మొక్కులు తీర్చుకుంటున్నారు. జనవరి 17వ తేదీ బుధవారం ఒక్కరోజే సుమారు రెండున్నర లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క – సారక్క దేవతలకు ప్రీతికరమైన బెల్లం నెత్తిన ఎత్తుకొని తరలివచ్చి వన దేవతలకు మొక్కలు తీర్చుకున్నారు. సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. నూతనంగా నిర్మించిన స్నాన ఘట్టాల వద్ద ట్యాప్స్‌ను ప్రారంభించడంతో జంపన్నవాగు జలకాలాడి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు..
సామాన్య భక్తులతో పాటు VIPలు, ప్రజాప్రతినిధుల తాకిడి కూడా విపరీతంగా పెరిగిపోయింది. జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన మనవడితో సహా నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన కొండా సురేఖ సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క – సురేఖ జాతర ఏర్పాట్ల ను పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలు దర్శించుకుంటున్నారు. అయితే ఈసారి జాతరకు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్న ప్రభుత్వం, అందుకు తగిన ఏర్పాటు చేస్తోంది. కానీ భక్తులు మాత్రం జాతరకు ముందే తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవతలకు ప్రీతికరమైన బెల్లం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. సెలవు దినాల్లో భక్తుల తాకిడి విపరీతంగా కనిపిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…