తెలంగాణ కుంభమేళా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జన జాతర (Medaram Jatara 2022) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో కిక్కిరిపోయింది మేడారం జాతర. ఆదివాసీల ఆచారాలతో నిండు పున్నమి వేళ బుధవారం రాత్రి 10.47 గంటలకు సారలమ్మ తల్లి(Saralamma) గద్దెపై కొలువైన ఘట్టం కనుల పండువగా సాగింది. మేడారం జాతరలోతొలిఘట్టం ఆవిష్కృతమైంది. సారలమ్మ గద్దెలపైకి చేరుకుంది. కన్నెపల్లి నుంచి అమ్మ ప్రతిరూపాలుగా భావించే, పసుపు-కుంకుమల భరిణలను మేడారంకు తీసుకొచ్చి గద్దెపైన ప్రతిష్ఠించారు పూజారులు. సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన కన్నెపల్లి ఆడపడుచులు.. అమ్మలను ప్రతిష్ఠించే గద్దె వద్ద శుద్ధి కార్యక్రమాలు చేశారు. భక్తుల కోలాహలం మధ్య సారలమ్మను తీసుకొచ్చారు పూజారులు. అమ్మవారి రాకను చూసేందుకు, సారలమ్మకు ఆహ్వానం పలికేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.
సారలమ్మను దర్శించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి
గద్దెలపై ప్రతిష్టించిన అనంతరం సారలమ్మను దర్శించుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమ్మక్క- సారలమ్మ దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటున్నానని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.
ఇవాళ సమ్మక్క ఆగమనం..
ఇక ఇవాళ చిలకల గుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకు వస్తారు పూజారులు. సమ్మక్క తల్లికి ప్రభుత్వ లాంఛనాలతో ఆహ్వానం పలుకుతారు అధికారులు, మంత్రులు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా పోలీసు అధికారి గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు..
రెండు దశాబ్దాల తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి రోజు..
అయితే ఈ ఏడా మరో ప్రత్యేకత ఉంది. రెండు దశాబ్దాల తర్వాత మేడారం జాతరలో అద్భుతం చోటు చేసుకుంది. గత రెండు దశాబ్దాలలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుధవారం రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే రోజే జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదని సమ్మక్క ఆలయ పూజరి కొక్కెర రమేశ్ తెలిపారు. ప్రతిసారి బుధవారం జాతర ప్రారంభించడం మేడారంలో ఆనవాయితీగా వస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి, బుధవారం ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. గత ఏడాది జాతర ముగిసిన రోజు వచ్చిందని సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: Raja singh: బీజేపీకి ఓటెయ్యకపోతే బుల్డోజర్లతో తొక్కించేస్తా.. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఈసీ నోటీసులు
Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..